మెదక్ : జిల్లా కేంద్రం మెదక్ ( Medak ) లోని పుష్పల వాగు, నక్క వాగు వద్ద ప్రవహిస్తున్న వరద ఉధృతిని మెదక్ మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy) , బీఆర్ఎస్(BRS) నాయకులతో కలిసి పరిశీలించారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రవహిస్తున్న మెదక్ పుష్పల వాగు వరద నీటిని పరిశీలించారు.
అనంతరం హవెళి ఘనపూర్ నుంచి ఎల్లారెడ్డి వెళ్లే రహదారిలో నక్కవాగు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో, ఒక కారు రోడ్డు దాటే క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నక్క వాగును పరిశీలించారు. అక్కడున్న మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు ( SP Srinivas Rao ) తో మాట్లాడుతు కారులో ఉన్న వ్యక్తులను కాపాడడానికి సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.
రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగుల వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు ఎవరు బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. సంబంధింత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులలో తప్ప , ప్రయాణాలు చేయకూడదని అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగే చోట బీఆర్ఎస్ శ్రేణులు సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు. ఆమెతో పాటు పట్టణ పార్టీ కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణ గౌడ్, జుబర్ అహ్మద్, న్యాయవాది జీవన్ రావు, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా, నరేందర్, నాయకులు రామచంద్ర రెడ్డి, ఫాజిల్, రంజిత్ నాయక్ తదితరులు ఉన్నారు.