సిద్దిపేట, జనవరి 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలు అట్టర్‌ప్లాప్ అయ్యాయి. ప్రభుత్వానికి మైలేజీ వస్తది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆడియాశలు అయ్యాయి. ఏడా ది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నాలుగు రోజులపాటు సిద్దిపేట, మెద క్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన గ్రామసభలతో తేటతెల్లమైంది. గ్రామాల్లో నిరసనలు, నిలదీతలతో నాలుగు రోజుల పాటు పల్లెలు దద్దరిల్లాయి. గ్రామ సభకు హాజరైన అధికారులకు ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది.
ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం అధికారులు చెప్పలేక పోయారు.. గ్రామాలకు వెళ్లామా..? జాబితా చదివామా..? మమ అనిపించామా..? అన్నట్లుగా గ్రామ సభలు నిర్వహించారు. జాబితాలు చదవడం మొదలవ్వగానే ప్రజలు తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఏం హామీలు ఇచ్చారు. ఇప్పడు చేస్తున్నది ఏమిటి అంటూ గ్రామాల్లో ప్రజలు నిలదీశారు. మొత్తంగా నాలుగు రోజుల గ్రామసభల్లో అటు ప్రభుత్వానికి, ఇటు అధికార యంత్రాంగానికి ప్రజలు ముచ్చెమటలు పట్టించారు.