చేర్యాల,ఆగస్టు 25: రోడ్ల విస్తరణపై సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల-నాగపురి రోడ్డు ప్రమాదకరంగా మారింది. సింగిల్ లైన్ రోడ్డు పై ట్రాఫిక్ పెరిగిపోవడంతో తరచూ రహదారిపై యాక్సిడెంట్లు జరుగుతుండడంతో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. దశాబ్దాలుగా చేర్యాల-నాగపురి రోడ్డు సింగిల్ రోడ్డుగానే ఉండిపోయింది.
దీం తో చేర్యాల మండలంలోని నాగపురి,శబాష్‌గూడెం, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి గ్రామాల ప్రజల బాధలు వర్ణణాతీతంగా మారాయి. ఇదే గ్రామాలకు చెందిన విద్యార్థులు సైతం చేర్యాల పట్టణంలోని కళాశాలలు, పాఠశాల ల్లో విద్యాభ్యాసం చేస్తుంటారు. అన్నివర్గాలకు ఎంతో ఉపయోగపడే చేర్యాల-నాగపురి రో డ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని నాగపురి గ్రామస్తులు నిత్యం ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు. అయినప్పటికీ రోడ్డును విస్తరించేందుకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
చేర్యాల మండలంలోని 15 గ్రామాల ప్రజలతో పాటు మద్దూరు, ధూళిమిట్ట మండలం, జనగామ జిల్లాలో బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు చేర్యాల మీదుగా కడవేర్గు, పెద్దరాజుపేట, నాగపురి, శబాష్‌గూడెం మీదుగా జగదేవ్పూ ర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి, మేడ్చల్ జిల్లా కీసర మీదుగా హైదరాబాద్‌కు, ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ప్రజలు ప్రయాణిస్తుంటారు.
ఇదే గ్రామాల మీదుగా హైదరాబాద్‌లోని ఈసీఐఎల్, కుషాయిగూడ, నాగా రం, బాలాజీనగర్, దమ్మాయిగూడ, రాం పల్లి, కీసర, ఘట్కేసర్ తదితర ప్రాంతాల నుంచి వెళ్లి అక్కడ జీవనం సాగిస్తున్న ప్రజలు తమ వాహనాల్లో వందల సంఖ్యలో ఇదే రోడ్డు మార్గంలో వస్తుంటారు. పండుగ, పర్వదినాల్లో ఈ రోడ్డు ట్రాఫిక్‌తో నిండిపోతుందంటే అతిశయోక్తి కాదు. వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడి నుంచి నాగపురి-చేర్యాల రోడ్డు పై తిరిగి వరంగల్‌కు వెళ్తుంటారు.
ఆర్అండ్బీ శాఖకు చెందిన చేర్యాల-నాగపురి రహదారిపై ప్రయాణం నరకప్రాయంగా మా రింది. రోడ్డుపై నిత్యం వందల సంఖ్యలో కా ర్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఆటోల్లో వేల సంఖ్యలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. సింగిల్ రోడ్డుపై ప్రయాణ సమయంలో ఎదురెదుగా వాహనాలు వస్తే రోడ్డు దిగి ఎక్కాలంటే ఇబ్బందిగా మారింది. రోడ్డు గుంతలమయంగా మారి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. సంబంధితశాఖ అధికారులు స్పందించి సింగిల్ రోడ్డుగా ఉన్న చేర్యాల-నాగపురి రహదారిని డబుల్ రోడ్డుగా మా ర్చడంతోపాటు ప్రమాదాలు జరిగే స్పాట్లను గుర్తించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.