సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీసులు ఎలాంటి వాహనాలను తనిఖీ చేయడం లేదు. బస్టాండ్లు, రద్దీ ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. నిఘా వ్యవస్థ పనితీరు సరిగ్గా లేక అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
పటాన్చెరు, నవంబర్ 13 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, బీహార్, ఛత్తీశ్‌గఢ్, అస్సాం,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. కొందరు దేశంలోని పలు ప్రాంతాల్లో నేరాలు చేసి తప్పించుకొని ఇక్కడ నివాసం ఉండి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారనే ప్రచారం ఉంది. ఢిల్లీలో బాంబుపేలుడు, హైదరాబాద్‌లో ఉగ్రవాది అరెస్ట్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాలు పసిగిట్టే పనిలో నిఘా విభాగాలు పని చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పటాన్‌చెరుకు హైదరాబాద్ పట్టణం అతిసమీపంలో ఉండడంతో ఎంతో కీలకమైన ప్రాంతమైంది. పోలీస్‌శాఖలో ఉండే నిఘా విభాగం కీలకంగా పని చేయాల్సి ఉన్నా అందుకు భిన్నంగా వారు ఎక్కువగా ఇతర పనుల్లో బిజీగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రతి పీఎస్పరిధిలో నిఘా కోసం (స్పెషల్ బ్రాంచ్- ఎస్బీ ) పోలీసులు పని చేస్తారు. జిల్లా స్థాయిలో ఉన్న డీఎస్పీ, సీఐలకు నేరుగా వీరు అవసరమైన సమాచారం ప్రతి రోజూ అందిస్తారు. పటాన్చెరు సబ్ డివిజన్ పరిధిలో పటాన్చెరు, బీడీఎల్ భానూర్, అమీన్పూర్, బొల్లారం, జిన్నారం, గుమ్మడిదల పోలీస్స్టేషన్లు ఉన్నాయి.
నిఘా విభాగంలో పని చేస్తున్న వారు ఎక్కువగా డబ్బుల కోసం పాస్‌పోర్టు విచారణకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఎస్పీ పరిధిలో పనిచేసే ఎస్బీ పోలీసులు అంటే గతంలో డీఎస్పీలు, సీఐ స్థాయి అధికారులు భయపడే పరిస్థితి ఉండేది. పటాన్చెరు డివిజన్లో ఎస్బీ పోలీసుల పనితీరు అధ్వానంగా తయారైందనే ఆరోపణలు ఉన్నాయి. నిఘా వ్యవస్థ పనితీరు సరిగ్గా లేక పటాన్చెరు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, ఖాజీపల్లి, బొంతపల్లి, గుమ్మడిదల, రుద్రారంలోని రసాయన, ఇతర ఫ్యాక్టరీల్లో పలు రాష్ర్టాలకు చెందిన వారు కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారని తెలిసింది.
ఢిల్లీబాంబుపేలుడుతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. నిఘావర్గాలు హెచ్చరికలు లేకపోవడంతో పోలీసులు లాడ్జీలు, వాహనాలను తనిఖీ చేయడం లేదు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా ఎలాంటి వాహనాలను తనిఖీ చేసిన సంఘటనలు లేవు. పటాన్చెరు డివిజన్లో పలు రాష్ర్టాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నా ఎక్కడ కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. జిల్లా స్థాయి అధికారులు నిఘా అధికారుల పై ఓ కన్నేసి ప్రక్షాళన చేయల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
బస్టాండ్లు, రద్దీ ప్రదేశాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు నిరంతరం నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అసాంఘిక కార్యకలాపాలపై అనునిత్యం నిఘా పెట్టాల్సిన ఎస్బీ, ఇంటెలిజన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు పీఎస్‌లకు పరిమితమవుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. నిఘా వ్యవస్థల పనితీరు మెరుగుపర్చి సమాచార సేకరణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. నిఘావిభాగంలో పని చేస్తున్న వారు కానిస్టేబుల్ నుంచి ఎస్సై, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుళ్లు పటాన్చెరు ప్రాంతంలోనే ఉంటున్నారు. కొందరు ప్రతి రోజూ పీఎస్‌ల చుట్టూ తిరుగుతూ ముందుగా ఎస్బీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే అధికారులకు సమాచారం ఇస్తున్నారని తెలిసింది.
పటాన్చెరు ప్రాంతంలో వేలాది ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు తక్కువ జీతంతో పని చేసే కార్మికులను పలు రాష్ర్టాల నుంచి తీసుకువచ్చి పనిలో పెడుతున్నారు. కొందరు లేబర్ కాంట్రాక్టర్లు పశ్చిమబెంగాల్, బీహార్, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ర్టాల నుంచి తీసుకువచ్చి వారికి వసతితో పాటు భోజన సౌకర్యం కలిపిస్తున్నారని సమాచారం. అక్రమంగా వచ్చిన వారికి లేబర్ కాంట్రాక్టర్లు రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే అధికారులకు డబ్బులు ఇచ్చి గుర్తింపు కోసం ఆధార్‌కార్డులు ఇప్పిస్తున్నారని తెలిసింది.
పటాన్చెరు తహసీల్ కార్యాలయంలో పని చేసే ఓ అధికారి ఆరేండ్లుగా ఇక్కడ పని చేస్తున్నా జిల్లా అధికారులు బదిలీ చేయడం లేదు. దీంతో లేబర్ కాంట్రాక్టర్ల నుంచి భారీగా డబ్బులు తీసుకొని వలస కార్మికులకు ఆధార్ కార్డులు మంజూరు చేసేందుకు సహకరిస్తున్నారని తెలిసింది. పటాన్చెరు రెవెన్యూ కార్యాలయంలో పని చేస్తున్న అధికారి వలస కార్మికులకు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రెవెన్యూశాఖలో పని చేస్తున్న అధికారికి రాష్ట్ర స్థాయిలో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడి ప్రోత్సాహంతో ఎక్కువ కాలం ఇక్కడ పని చేస్తున్నాడని తెలిసింది. అవినీతి, అక్రమలకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పటాన్చెరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఫ్యాక్టరీలో పని చేస్తున్న వలస కార్మికుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. పోలీసులు వారు ఉండే ప్రాంతల్లో తనిఖీ చేస్తున్నారు. ఫ్యాక్టరీల వద్ద సైతం కార్మికుల గుర్తింపు కార్డులు పరిశీలించి ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారో సమాచారం సేకరిస్తున్నారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేసేందుకు ఆదేశాలు జారీ చేశాం. రాత్రి సమయంలో లాడ్జీలు తనిఖీ చేసేందుకు పోలీసులకు సూచనలు ఇచ్చాం.
-ప్రభాకర్, డీఎస్పీ పటాన్చెరు, సంగారెడ్డి జిల్లా