రామాయంపేట రూరల్, మే15 : ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలులో మాత్రం చాలా జాప్యం చేస్తుంది. స్పష్టమైన విధానాలు లేకుండా అమలు చేసే పథకాలు అమలు గురించి వింటేనే ఆందోళన కలుగుతుందని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదట్లో ఒక విధంగా తరువాత మరో విధంగా చెప్పడం వల్ల లబ్ధిదారులు కూడా వాటిని నిర్మించుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. మండలంలో దామరచెర్వు గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతో ఇక్కడ మాత్రమే ఇండ్లు కడుతున్నారు. మిగతా గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకోవడానికి ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెప్పడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ధరఖాస్తు చేసుకోగా అర్హులైన కొందరికి బాండ్లు ఇచ్చారు. అవి కూడా కొంత మందికే రేషన్ అందుతుంది. టెక్నికల్ ప్రాబ్లం వల్ల సమస్య వస్తుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఫ్రీ బస్సు వల్ల ఆటోలపైనే ఆదారపడి కుటుంబాలను పోషించుకునే తమ పొట్ట కొట్టారని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు ఉపాధిపోయి అప్పుల పాలు కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికాలంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు కాకపోవడం, బస్సుల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెంచుతామన్న పెన్షన్‌తో పాటు కొత్త పెన్షన్ల గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు మాట్లాడకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న బియ్యం బోనస్‌తో కొంటామని చెప్పి చాలా సెంటర్లలో నిబంధనల ప్రకారం టార్గెట్ నిండితేనే కొంటామని చెప్పడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కూడా అస్తవ్యస్తంగా ఉండటంతో చాలా మంది దరఖాస్తులు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఏ ఒక్క పనిని సక్రమంగా చేయలేదని, ఇకనైనా పారదర్శక పాలన అందించాలని ప్రజలు కోరుతున్నారు.