టెహ్రాన్: ముడి చమురు, సరుకు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ సముద్ర మార్గాన్ని తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇది కేవలం చైనా కోసమేనని స్పష్టం చేసింది. చైనా ఆయిల్ ట్యాంకర్లు, కంటైనర్ నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఇస్తున్నామని ఇరాన్ వెల్లడించింది. చైనా మినహా ఇతర దేశాలకు అనుమతి లేదని, అనధికారికంగా ఇక్కడి నుంచి వెళ్తే.. మిలిటరీ చర్యను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది.
యుద్ధ సమయంలో తమకు మద్దతుగా నిలబడిన చైనాకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులు బుధవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. తమ హెచ్చరికను లెక్కచేయకుండా హొర్ముజ్ జల మార్గంలో వెళ్తున్న 10 ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ టార్గెట్ చేసింది. భారత్ సహా ఆసియా దేశాలకు ముడి చమురు సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది.