సిద్దిపేట, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఏడాది కిందట అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుపై భ్రమలు వీడాయి.ఈ ఏడాది పాలనలో ఏ ఒక్క హామీని సరిగ్గా అమలు చేయలేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో ఊదరగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక వాటి ఊసే ఎత్తడం లేదని, ఏం చేశారని విజయోత్సవాలు నిర్వహిస్తున్నారంటూ ప్రజలు ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు కూడా విజయోత్సవాలపై సీరియస్‌గా దృష్టిపెట్టడం లేదు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు,నాయకులు విజయోత్సవాలకు దూరంగా ఉంటున్నారు. గ్రామాలకు పోతే హామీలపై ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అన్న భయం వారిని పట్టుకున్నది. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు గ్రామాల్లో సాంస్కృతిక కళాబృందాలను ప్రజలు నిలదీశారు. రూ.2 లక్షల పైన ఉన్న రైతుల పంట రుణమాఫీ ఏమై ంది..? రేషన్‌కార్డులు ఏవి..? ఆడబిడ్డలకు ఇస్తామన్న రూ 2,500 ఏవి..? కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైంది..? రైతుభరోసా ఏది..? అంటూ అన్నివర్గాల ప్రజలు రేవంత్ సర్కార్‌ను నిలదీస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది కాలంలో పాత మెదక్ జిల్లాపై శీతకన్ను వేసింది. ఏడాదిగా జిల్లాకు నిధులు కేటాయించలేదు. కొత్తగా పైసా అభివృద్ధి పని జరగడం లేదు. గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, ఎమ్మెల్యేల కోటా కింద వచ్చే నిధులు ఆపేశారు. జిల్లాకు వచ్చే ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. జిల్లాకు ప్రత్యేక కేటాయింపులు లేవు. ఏడాదిగా నిధులు లేక పోవడంతో జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.
మెదక్‌లో మెడికల్ కళాశాలను 100 సీట్ల నుంచి 50కి కుదించి రేవంత్ సర్కారు అన్యాయం చేసింది. సిద్దిపేట నుంచి వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు సీఎం రేవంత్ తరలించుకు పోయాయి. జిల్లాలో వందల కోట్ల రూపాయల నిధులు రద్దుచేసిండు. అనేక అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ప్రభుత్వం ఆపేసింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లా ల్లో అనేక పనులు రద్దు చేసి కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రోడ్ల పనులు ఆగిపోయాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు వాపోతున్నారు. రైతుభరోసా రాక రైతులు మళ్లీ అప్పులు చేసి పంటలు సాగుచేస్తున్నారు. ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని రేవంత్ సర్కారు గొప్పలు చెప్పి తమను మోసం చేసిందని యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నది. నిరుద్యోగ భృతి, యువతకు వడ్డ్డీలేని రుణాలు ఇస్తామనే హామీ బుట్టదాఖలు కావడంతో నిరాశలో ఉన్నారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు, పెన్షనర్లకు, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు, మహిళలకు, రైతులకు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని ఆయా వర్గాలు వాపోతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు నిధుల వరద పారింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టింది. కేసీఆర్, హరీశ్‌రావు పాలనలో మెదక్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పదేండ్లలోనే ఎంతో అభివృద్ధి జరిగి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు విడుదల కాక అభివృద్ధి కుంటుపడింది.
గతంలో మంజూరు చేసిన నిధులను సైతం రద్దు చేసి ఉమ్మడి జిల్లాపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టింది. నేటితో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తి అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిత్యం ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యన ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. హామీలను నెర వేర్చకపోవడంతో ఏడాదిలోనే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. రేవంత్ సర్కార్ ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు.
డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం విజయోత్సవాలు నిర్వహిస్తున్నది. చేసింది ఏం లేక…చెప్పడానికి ఏం లేదు.. ఇక విజయోత్సవాలు ఏంటి అని అధికార పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు.ఇక ప్రజల మధ్యకు పోయి ఏం విజయోత్సవాలు చేస్తామంటూ ముఖం చాటేస్తున్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ వారి సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అంతే..వారు కూడా పాల్గొన్నది లేదు. ఐదారు రోజులుగా జరిగిన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ దూరంగానే ఉంది.ఏదో చేశాము అన్నట్లుగా అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు.