సిద్దిపేట కలెక్టరేట్, జూలై 12: ఆరేండ్ల నుంచి రూ.8,243 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చారని, రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తుంటే పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారంతోపాటు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆముదాల రంజిత్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్ కుమా ర్, కార్యకర్తలు పాల్గొన్నారు.