చేర్యాల, జనవరి 20: పట్నం వారం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అగ్నిగుండాలను భక్తులు దాటే కార్యక్రమం ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగగా, పెద్దపట్నం చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. పట్నం వారానికి వచ్చిన భక్తులు శనివారం ధూళిదర్శనం, ఆదివారం బోనాలు, పట్నాలు, సోమవారం పెద్ద పట్నం, అగ్నిగుండాలు నిర్వహించడం ఆనవాయితీ.
ఆలయ అర్చకులు పూజలు చేసిన అనంతరం హైదరాబాద్ ఒగ్గు పూజారులు పంచవర్ణాలు (తెలుపు, పసుపు, నీలి, ఎరుపు, ఆకుపచ్చ) రంగుల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలు( మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలను వరుసుగా పేర్చి అగ్నిగుండంగా తయారు చేశారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అర్చకులు ఆలయం నుంచి పెద్దపట్నం, అగ్నిగుండం వరకు తీసుకొచ్చి పూజలు చేశారు. పెద్దపట్నం, అగ్నిగుండాలను ఆలయ అర్చకులు దాటిన వెంటనే భక్తులు పట్నం, అగ్నిగుండాలను దాటి మల్లికార్జున స్వామి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సంప్రదాయం మేరకు శివసత్తులకు, ఘనాచార్యులకు ఆలయ ఈవో రామాంజనేయులు, పాలక మండలి సభ్యులు కండువా, జాకెట్ ముక్కలతో పాటు స్వామి వారి బండారిని పంపిణీ చేశారు. అంతకుముందు భక్తులు పసుపును ఒల్లంతా పూసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు.
భారీ బందోబస్తు
పట్నం, అగ్నిగుండం వారం సందర్భంగా మల్లన్న క్షేత్రంలో ఏఆర్ అడిషనల్ డీసీసీ సుభాష్ చంద్రబోస్, హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, సీసీఎస్ ఏసీపీ యాదగిరి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీస్ అధికారులు సిబ్బందికి సూచనలు చేస్తూ సీసీ కెమెరాల్లో పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్, గజ్వేల్ ట్రాఫిక్ సీఐ మురళి, గజ్వేల్ అడిషనల్ సీఐ ముత్యం రాజు, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ పాల్గొన్నారు. అగ్నిగుండం వద్ద సొమ్మసిల్లి పడిపోయిన ఓ భక్తురాలిని ఏఆర్ పీసీ మహేందర్ హుటాహుటిన మెడికల్ క్యాంపు వద్దకు ఎత్తుకెళ్లి వైద్యం అందించడంతో పలువురు అభినందించారు.
అందరి సహకారంతో విజయవంతం: ఈవో
కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో కీలకమైన మొదటి ఆదివారం(పట్నం వారం), అనంతరం నిర్వహించే పట్నం, అగ్నిగుండాలను అందరి సహకారంతో విజయవంతంగా పూర్తి చేశామని ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు. మల్లన్న ఆలయంలో ఆయన మాట్లాడుతూ.. భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో వారు సకాలంలో దర్శనాలు చేసుకున్నారని తెలిపారు. ఆయనతో పాటు ఆలయ పాలక మండలి సభ్యులు, ఏఈవో, సూపరింటెండెంట్లు, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులున్నారు.
పట్నం దాటేందుకు ఇబ్బందులు పడిన అర్చకులు
ఆలయ సంప్రదా యం ప్రకారం ఆల య అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పట్నం, అగ్నిగుండం వద్ద ప్రదక్షణ చేసిన అనంతరం కొబ్బరికాయ కొట్టిన అనంతరం పట్నం తొక్కి, అగ్నిగుండం దాటి స్వామి వారి ఆలయానికి వెళ్లిపోతారు. అర్చకులు ఆలయంలో స్వామి వారి విగ్రహాలు తీసుకుని అగ్నిగుండం, పట్నం వేసిన ప్రదేశానికి చేరుకునే వరకు హైదరాబాద్ భక్తులతోపాటు ఇతరులు వారిని వెంబడించి వెళ్లడంతో అగ్నిగుండం నిర్వహించే ప్రధాన గేట్ వద్ద పోలీసులు అర్చకులను వదిలిపెట్టి ఇతరులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అర్చకులు పట్నం, అగ్నిగుండం ప్రదేశానికి చేరుకుని అక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలు ముగించక ముందే ఇతరులు పట్నం పైకి దూసుకుపోవడంతో అర్చకులు పట్నం దాటి అగ్నిగుండం తొక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు, ఆలయవర్గాల సహకారంతో అక్కడి నుంచి ఆలయానికి వెళ్లిపోయారు. ప్రతి ఏటా అర్చకులకు ఇదే పరిస్థితి తలెత్తుతుండడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.