సిద్దిపేట, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పింఛన్ ఎప్పుడు వస్తుంది అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా 4,69,575 మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి నెలనెలా డబ్బులు రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగత అవసరాలతోపాటు, మందులు ఇతర వాటిని కొనుక్కోవడానికి వారిచేతిలో డబ్బులు లేక నానాఅవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నెలనెలా డబ్బులను నిర్ణీత గడువులో నేరుగా పింఛన్‌దారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమ చేసే వారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలనెలా సరిగా పింఛన్ డబ్బులు పడడం లేదు. గతంలో ఒక నెల డబ్బులు పూర్తిగా వేయలేదు. ఏప్రిల్, మే పింఛన్ డబ్బులు రావాల్సి ఉండగా, ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ డబ్బులు వచ్చాయి. మే డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ చివరి వరకు వచ్చింది. ఇప్పటి వరకు మే డబ్బులు పత్తాలేదు. జూన్ మాసం గడిస్తే రెండు నెలల పింఛన్ డబ్బులు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ డబ్బులు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఉన్న పింఛన్ డబ్బులను సరిగా వేయడం లేదని పింఛన్‌దారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా రూ.102.22 కోట్ల లబ్ధిదారుల వ్యక్తి గత బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ఇందులో దివ్యాంగులు 37,785 మంది ఉన్నారు. వీరి కోసం ప్రతి నెలా ఒక్కోక్కరికీ రూ. 4,016 చొప్పున రూ. 15,17,44,560 జమ చేసింది. మిగతా వర్గాల వారు 4,31,790 మందికి మొత్తం రూ. 87,04,88,640లను ప్రతినెలా ఇబ్బంది లేకుండా చెల్లించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంతో పింఛన్‌దారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ అలవికానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచిపోయింది. తాము అధికారంలోకి రాగానే వృద్ధుల పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తామని చెప్పి మొఖం చాటేసింది. నెలనెలా పింఛన్ డబ్బులు సరిగా ఇవ్వని ప్రభుత్వం కొత్తగా పింఛన్ డబ్బులు పెంచి ఇస్తదన్న నమ్మకం లేదని పింఛన్‌దారులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఆరు నెలల అయినా ఈ ప్రభుత్వం హామీల అమలు దిశగా ఆలోచన చేయడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరునెలలకు ఒక్కో పింఛన్‌దారుడికి అదనంగా రూ. 12 వేలు చెల్లించాలని ఆ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉన్న పింఛన్లు సక్కగా ఇస్తే మాకు అదే చాలని పింఛన్‌దారులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ఎదురుచూపులే అవుతున్నాయి. ఆసరా పింఛన్ లబ్ధిదారులు, రైతులు, కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు ఎదురుచూపులే అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతినెలా ఠంఛన్‌గా ఆసరా పింఛన్లు పడుతుండే.. సెల్‌ఫోన్‌కు మెసేజ్ రాగానే నేరుగా బ్యాంకుకెళ్లి డబ్బులు తెచ్చుకునేవారు. అప్పడు ఎలాంటి రందీ లేదు. పింఛన్ రాదనే భయమూ లేదు.
ఉమ్మడి జిల్లాలోని పింఛన్‌దారులు డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతవరకు పింఛన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాల వారికి ఎదురు చూపులే మిగిలాయి. పింఛన్ డబ్బులు వస్తే వారికి కావాల్సిన వస్తువులు, మందులు తదితర అవసరాలు తీర్చుకుంటారు. పింఛన్‌దారులకు నెలనెలా పింఛన్ రాకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ డబ్బులను పెంచుతామని గొప్పలు చెప్పింది. ఉన్న పింఛన్లు ఇవ్వడానికే ఈ ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. తక్షణమే బకాయి ఉన్న పింఛన్ డబ్బులు చెల్లించి పింఛన్‌దారులను ప్రభుత్వం ఆదుకోవాలి.
సమైక్య రాష్ట్రంలో చాలీచాలని పింఛన్లు కొన్ని వర్గాలకే అందించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులతోపాటుగా ఎయిడ్స్, పైలేరియా, డయాలసిస్ బాధితులను కూడా అకున చేర్చుకుని కేసీఆర్ ప్రభుత్వం పింఛన్లు అందించింది. నాటి సమైక్య రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కేవ లం రెండు వందలు, దివ్యాంగులకు ఐదు వందల పింఛన్లు మాత్రమే ఇచ్చారు. కేసీఆర్ నెలనెలా దివ్యాంగులకు రూ.4వేలు, మిగి తా వర్గాలకు 2వేలు అందించారు. సిద్దిపేట జిల్లాలో 1,91,185 మంది లబ్ధిదారులకు రూ.41,39,02,960, మెదక్ జిల్లాలో 1,16,728 మంది లబ్ధిదారులకు రూ. 25,24,39,648, సంగారెడ్డి జిల్లాలో 1,61,662 మంది లబ్ధిదారులకు రూ. 35,58,90,592 ప్రతినెలా చెల్లించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలుపుకొని మొత్తం 4,69,575 మంది ఉన్నారు. వీరిలో 1,64,405 మంది వృద్ధులు, 1,74, 940 మంది వితంతువులు, 37,785 మంది దివ్యాంగులు, 4,814 మంది గీత కార్మికులు, 3,525 చేనేత కార్మికులు, 3,107 మంది హెచ్ఐవీ బాధితులు, 3,448 మంది పైలేరియా వ్యాధిగ్రస్తులు, 339 మంది డయాల సిస్ పేషెంట్లు, 300 మంది బీడీ టేకేదారులు, 41,608 మంది బీడీ కార్మికులు, 15,304 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారందరికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నెలనెలా ఒకటో తేదీనే పింఛన్లు అందజేసింది.