సంగారెడ్డి, నవంబర్ 19(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి క్యాడర్‌కే కాదు అధిష్టానానికి అంతుపట్టడం లేదు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించాల్సిన ముఖ్యనేతలు ముగ్గురు తలోదారి పట్టడమే ఇందుకు కారణం. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీచేసిన కాటా శ్రీనివాస్‌గౌడ్, ఎంపీగా పోటీచేసిన నీలం మధు ఎవరికివారే సొంత ఎజెండాతో పనిచేస్తుండడం కాంగ్రెస్ అధిష్టానానికి జీర్ణంకావడం లేదు. ముగ్గురు నేతలు ఇప్పటి వరకు ఒకే వేదికపైకి కలిసి రాలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కాటా శ్రీనివాస్‌గౌడ్ సైతం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మూడురోజుల క్రితం సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రి దామోదర్ హాజరయ్యారు.
ఈ సమావేశానికి సైతం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్ డుమ్మా కొట్టారు. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు సైతం ఇరువురు నేతలు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన కార్యక్రమాన్ని పటాన్చెరు నియోజకవర్గంలోని చిట్కుల్లో మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్ హాజరు కాలేదు. మంగళవారం పార్టీ నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమానికి ఇద్దరు నేతలు దూరంగానే ఉన్నారు.
మంత్రి దామోదర అనుచరుడిగా పేరున్న కాటా శ్రీనివాస్‌గౌడ్ దామోదర హాజరయ్యే కార్యక్రమాల్లో సైతం పాలుపంచుకోవడం లేదు. మంత్రి దామోదర్, కాటా శ్రీనివాస్‌గౌడ్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయని, దీంతో కాటా శ్రీనివాస్‌గౌడ్ పార్టీకి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పనిచేయడం లేదు. ముగ్గురు నేతల వ్యవహారం పార్టీకి నష్టం కలిగిస్తున్నదని పటాన్‌చెరులోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు నేతల తీరు ఇలాగే కొనసాగితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడం ఖాయమని అటు అధిష్టానం.. ఇటు క్యాడర్ ఆందోళన చెందుతున్నది.
పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇక్కడ జరిగిన ఎమ్మెల్యేతో పాటు అన్ని ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు చెందిన మహిపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాస్‌గౌడ్ పోటీచేసి ఓటమి చెందారు. తన ఇంటిపై ఐటీ దాడులు జరగడం, సోదరుడి మధుసూదన్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదు కావడంతో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్‌లో చేరిన తనకు పదవి ఇవ్వడంతో పాటు నియోజకవర్గంలో పవర్ అప్పగిస్తారని మహిపాల్‌రెడ్డి ఆశించారు. కానీ, రేవంత్‌రెడ్డి సర్కార్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి ఎలాంటి పవర్ కట్టబెట్టలేదు. దీనికితోడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు, మంత్రులు మహిపాల్‌రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇది మహిపాల్‌రెడ్డికి జీర్ణం కావడం లేదు. దీంతో కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే అయిన తన ఒక్కడికే నియోజకవర్గానికి సంబంధించి పూర్తి బాధ్యతలు అప్పగించాలని మహిపాల్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తున్నది.
తాను ఓటమి పాలైనప్పటికీ మిగతా నియోజకవర్గాల తరహాలోనే తనకు పార్టీ, ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలని కాటా శ్రీనివాస్‌గౌడ్ కోరుకుంటున్నారు. అధిష్టానం మాత్రం ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించడం లేదు. ఈ కారణంగానే శ్రీనివాస్‌గౌడ్ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని తెలుస్తున్నది. మరోనేత నీలం మధు ముదిరాజ్ సైతం పార్టీ పదవిని ఆశిస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో తన గెలుపుకోసం సొంత పార్టీ నేతలు పనిచేయలేదని, తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఇద్దరు ముఖ్యనేతలను పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తున్న తనకు మాత్రమే ఎమ్మెల్సీ పదవితోపాటు నియోజకవర్గం పూర్తి బాధ్యతలు ఇవ్వాలని ఆయన కోరుతున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కాటా శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పనిచేసేందుకు నీలం మధు ససేమిరా అంటున్నట్లు సమాచారం. పటాన్చెరు నియోజకవర్గంలో ముగ్గురు కీలక నేతలు తలోదారి పట్టడంతో ఏమిచేయాలో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.