పటాన్చెరు, జనవరి 23: అమీన్పూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన ఎమ్మె ల్యే గూడెం మహిపాల్‌రెడ్డి విషయం తెలియగానే అర్ధాంతరంగా తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి క్యాంప్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. తాను చేతికి గాజులు తొడుక్కోలేదని, వచ్చినవారికి తడాఖా చూ పించే శక్తి తనకు ఉందన్నారు. ఘటనపై తాను కాంగ్రెస్ అధిష్టానంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మీడియాకు తెలిపారు. తనకు సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉందని, తాను చేతులకు గాజులు తొడుక్కోలేదని పే ర్కొన్నారు. కాట శ్రీనివాస్‌గౌడ్ ప్రోద్బలంతోనే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, కాట శ్రీనివాస్‌గౌడ్ శిఖండి రాజకీయా లు చేయడం మానుకోవాలని సూచించారు. రెండుసార్లు ప్రజలు నిన్ను తిరస్కరించిన సంగతిని మరిచి నీవే ఎమ్మెల్యేగా భావిస్తున్నావని, ప్రజలు ఛీకొట్టినా చిల్లర రాజకీయాలు చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాంప్ కార్యాలయంపై దాడి సమయంలో తన అభిమానులు ఫోన్లు చేసి అడ్డుకుంటామని చెబితే తాను వద్దన్నానని తెలిపారు. అంజయ్య సీఎంగా ఉన్న సమయం నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో తాను ప్రత్యక్షంగా ఉన్నానని గుర్తుచేశారు. కేసీఆర్‌తో దిగిన ఫొటోలు కార్యాలయంలో ఉండటం తప్పేలా అవుతుందని ప్ర శ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నాకు నచ్చిన ఫొటోలు ఆఫీసులో పెట్టుకుంటానని, దానిని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. మూర్ఖంగా ప్రతీది వ్యతిరేకించడం సబబు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు నిరసన తెలిపినా, నా దిష్టిబొమ్మ దహనం చేసినా తాను ఏమి అనుకోనన్నారు. కానీ, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది అధికారిక కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే నివాసం కూడా అని తెలిపారు. ఒక ఎమ్మెల్యే నివాసంపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులను తాను పిలుస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలను పార్టీ కార్యక్రమాలకు తప్పక పిలుస్తానని పేర్కొన్నారు. పటాన్చెరులో ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, ఇలా అభివృద్ధిని అడ్డుకునే సంస్కృతి లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు.