పటాన్చెరు టౌన్, జూన్ 23 : సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి ఏడాది కావస్తున్నా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఎందుకు ఇవ్వడం లేదని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం పటాన్చెరు మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ నాయకులు గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ చౌరస్తాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇస్నాపూర్ మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి ఆదర్శ్ రెడ్డి మాట్లాడారు.
సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి జూన్ 30 నాటికి సంవత్సరం అవుతుందని, ఈ ఘటనలో 54 మంది మృతి చెందితే, అందులో 8 మంది కార్మికుల జాడ ఇప్పటికీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 46 మందికి గాయాలు కాగా, ఇండ్లకే పరిమితమై అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన మరుసటి రోజు పరిశ్రమను సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.25లక్షలు రెండు, మూడు విడతల్లో ఇచ్చి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.
మిగతా పరిహారం ఎప్పుడిస్తారని ఆయన ప్రశ్నించారు. జూన్ 30 నాటికి ఇంకా వారం రోజుల సమయం ఉందని, ఆలోపు ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతున్నదని, ఇప్పటి వరకు ఒక్కరినే అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ గడ్డం వెంకట పరిహారం చెల్లింపుపై స్పష్టత ఇవ్వాలన్నారు. వారం రోజుల్లోగా పూర్తి పరిహారం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు జూన్ 30న సిగాచి పరిశ్రమ బాధితులతో కలిసి పాశమైలారం పారిశ్రామికవాడలో సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతులకు నివాళులర్పించి, బాధిత కుటుంబాల గోస ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆదర్శర్రెడ్డి చెప్పారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆదర్శ్‌రెడ్డి భరోసా ఇచ్చారు.ధాన్యం కొనుగోళ్ల విషయం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు. బీఆర్ఎస్ ప్రభుత్వ పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సిగాచి పరిశ్రమ బాధితులకు కోటి పరిహారం చెల్లించకుండా మోసం చేస్తున్నారని మాజీ జడ్పీటీసీ గడీల శ్రీకాంత్‌గౌడ్ ఆరోపించారు. బాధితుల పక్షాన ఆనాటి నుంచి బీఆర్ఎస్ అండగా ఉంటున్నదని, ఘటన జరిగిన రోజు వచ్చిన హరీశ్‌రావు బాధితుల వివరాల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. తడిబట్టలతో గుడి ఎక్కుదామని మాట్లాడే ఇక్కడి కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో బాధితులకు పూర్తి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పీసీబీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇతర డిపార్ట్మెంట్ల లోపాలతోనే పేలుడు జరిగిందని ఆరోపించాన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.