చౌటకూర్, నవంబర్ 1: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి బానోత్ మహేందర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థి ఆత్మహత్య చేసుకోలేదని, ఇది ముమ్మాటికి హత్యేనని కుటుంబీకులు ఆరోపించారు. శనివారం కుటుంబీకులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ కుమారుడిని హత్య చేసి, ఉరి వేసుకుని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు.
తమకు న్యాయం చేయాలని బైఠాయించి, నిరసన తెలిపారు. ఆత్మహత్యకు ముందు తన మొబైల్ ఫోన్ నుంచి హైదరాబాద్‌లో ఉన్న రాజు అనే వ్యక్తితో చివరిగా మాట్లాడినట్లు కాల్ లిస్ట్‌లో నమోదైందని, మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో కళాశాలకు సంబంధం లేని రాజు తమ కుమారుడిని హత్య చేసి ఉరి వేశారంటూ వారు ఆరోపించారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని మృతుడి తల్ల్లిదండ్రులు విలపించారు. కుటుంబీకులు, బంధువులు మహేందర్ వసతి గృహం మానేర్ బ్లాక్ 304 గదిని పరిశీలించారు. మూడు టవల్స్ ఒక చోట కట్టి గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటే ఫ్యాన్ రెకలు వంకరవుతాయని పేరొన్నారు.
లోపలి నుంచి గది తలుపులకు గడియ బిగించుకుంటే తలుపులు ధ్వంసం కావాలి కదా? అంటూ ప్రశ్నించారు. 70 కిలోల బరువు గల బీటెక్ విద్యార్థి మహేందర్ వేలాడితే ఫ్యాన్ వంగిపోయేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు. సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ కళాశాల వద్దకు వచ్చి కుటుంబీకులతో మాట్లాడారు. సమగ్ర విచారణ చేపడతామని హామీ ఇచ్చి కుటుంబ సభ్యులు, బంధువులను కళాశాల నుంచి పంపించారు. మార్చురీలో భద్రపర్చిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.