పంచాయతీల్లో పన్నుల వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యం చేరుకునేందుకు అధికారులు, సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 647 పంచాయతీల్లో ఈ ఏడాది రూ.38.38 కోట్లు టార్గెట్గా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.31.30 కోట్లు వసూలు చేశారు. అత్యధికంగా 96.17 శాతంతో మనూర్ మండలం మొదటి స్థానం, 70.45 శాతంతో కొండాపూర్ చివరి స్థానంలో నిలిచాయి. పట్టణ ప్రాంతాలైన జహీరాబాద్, జిన్నారం, హత్నూర, పటాన్చెరు, సంగారెడ్డి, రామచంద్రాపురం మండలాల్లో అనుకున్న స్థాయిలో వసూళ్లు కాకపోతుండడంతో అధికారులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 13: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పన్నుల వసూలు జోరందుకున్నది. మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న విషయం తెలిసిందే. అప్పటిలోగా వంద శాతం పనుల్నల వసూలే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలుం డగా, ఈ ఏడాది రూ.38.38 కోట్ల పన్ను వసూ లు లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు రూ.31.30 కోట్లు వసూలు చేశారు. మరో రూ.7.07 కోట్లు వసూలు కావాల్సి ఉన్నది. జిల్లాలో 81.56 శాతం వసూలు నమోదు కాగా, వచ్చేనెల రోజుల్లో 100 శాతం పూర్తి చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్మోహన్ వెల్లడించారు.
మనూరు ఫస్ట్.. కొండాపూర్ లాస్ట్…
మనూరు మండలంలో పన్నుల వసూలు ఫిబ్రవరికి 96.17శాతం పూర్తి కావడం విశేషం. ఈ మండలంలో మొత్తం టార్గెట్ రూ.6,80,499 కాగా, మొత్తం వసూలై జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. 70.45 శాతంతో కొండాపూర్ మండలం చివరి స్థానంలో ఉన్నది. ఈ మండలంలో రూ.1,98,63,880 కోట్ల లక్ష్యం ఉండగా, ఇప్పటి వరకు రూ.1,3993974 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.58,69,906 లక్షలు వసూలు కావాల్సి ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండలాలు మొదటి మూడు స్థానాల్లో నిలవడం గొప్పవిషయం. కాగా, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కొండాపూర్ మండలం చివరి స్థానంలో నిలిచింది. ప్రతి యేటా నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే పన్నులు వసూలు నత్తనడక కొనసాగేవి. ఈసారి అత్యధిక వసూళ్లతో తొలి మూడు స్థానాలను దక్కించుకున్నది.
టార్గెట్ రూ.38.38 కోట్లు..
మార్చి 31 వరకు సంగారెడ్డి జిల్లాలో రూ.38,38,54,219 కోట్ల పన్నులు వసూలు పూర్తి చేసి వంద శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో రూ.38,38,54,219 కోట్లు టార్గెట్ ఉండగా, రూ.31,30,71,259 కోట్ల పన్నులు వసూలయ్యాయి. ఇంకా రూ.7,07,82,960 కోట్లు వసూలు కావాల్సి ఉన్నది. దీంతో జిల్లాలో 81.56గా వసూలు శాతం నమోదు కాగా, 100 శాతం పూర్తి చేయాలని టార్గెట్తో అధికారులు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలైన జహీరాబాద్, జిన్నారం, హత్నూర, పటాన్చెరు, సంగారెడ్డి, రామచంద్రాపురంవంటి మండలాల్లో అనుకున్న స్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంతో పంచాయతీ అధికారులు రెట్టింపు పట్టుదలతో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. దాదాపు 82 శాతం పన్నుల వసూలు పూర్తి చేశామని, మిగతా 18శాతం వసూలు చేయడం పెద్ద సమస్యే కాదని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలనాటికి వసూలు పూర్తి చేస్తామంటున్నారు.
మార్చి 31 వరకు లక్ష్యం చేరుకుంటాం
జిల్లాలో పన్నుల వసూలు ప్రక్రియ బాగానే కొనసాగుతున్నది. దాదాపు రూ.7 కోట్లకు పైగా పన్నులు వసూలు కావాల్సి ఉన్నది. వచ్చే మార్చి ఆఖరు నాటికి ఆ మొత్తం వసూలు అవుతుంది. రూ.38 కోట్ల టార్గెట్ను పూర్తి చేస్తాం. గతంలో కంటే అధికంగా పన్నుల లక్ష్యం పెరిగింది. వచ్చే ఏడాది టార్గెట్ను రూ.40 కోట్లకు పైగా పెంచుతాం. పంచాయతీ సిబ్బందికి టార్గెట్లు విధించి పన్నుల వసూళ్ల చేస్తున్నాం. అందరూ బాగా పనిచేస్తున్నారు. పన్నుల వసూలు విషయంలో అన్ని గ్రామాల్లో ప్రజలు అధికారులు, సిబ్బందికి సహకరించాలి. పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి.
– సురేశ్మోహన్, జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి