Panchayat Elections | మెదక్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న ఆశావహుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లినట్లయ్యింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 15వ తేదీలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని అంతా భావించారు. అయితే కుల గణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు రీ సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చివరకు మరోసారి కుల గణన చేపట్టడంతో పాటు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఇక ఇప్పట్లో ఎన్నికలు జరగవని తేలిపోయింది. ఓ వైపు కుల గణన, మరో వైపు మార్చిలో పది, ఇంటర్ పరీక్షలు ఇలా సుమారు మూడు నెలలకు పైగా సమయం తీసుకునే అవకాశం ఉండటంతో ఎన్నికల వేడి తగ్గిపోయింది.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం…
మెదక్ జిల్లాలో 21 మండలాలు ఉన్నాయి. 492గ్రామ పంచాయతీలు , 21 జడ్పీటీసీ , 21 ఎంపీపీ స్థానాలతో పాటు మొత్తం 190 ఎంపీటీసీ స్థానాలు ఎన్నికలు జరుగనుండగా, జిల్లా వ్యాప్తంగా 1,052 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. జిల్లాలో మొత్తం 5,23,966 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళలు 2,71,878 మంది, పురుషులు 2,52,079 మంది, ఇతరులు 9 మంది ఉన్నారు. అయితే మార్చి రెండో వారం నాటికి పరిషత్, సర్పంచ్ ఎన్నికలు ముగించాలని ప్రభుత్వం మొదట భావించింది. అందుకు తగ్గట్టుగానే యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. ఇప్పటికే ఓటర్లు తుది జాబితాను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా బ్యాలెట్ బాక్సులు, నామినేషన్ పత్రాలు, బ్యాలెట్ పేపర్లు జిల్లాకు చేరాయి. అయితే మరో వైపు ఎన్నికల అధికారులకు శిక్షణ సైతం ఇచ్చారు. ఇకపోతే రిజర్వేషన్లు ఖరారు చేయడమే మిగిలి ఉంది. కాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల బరిలో నిలువాలన్న ఆశావహుల్లోనూ నిరాశ నెలకొంది.
వరుసగా పరీక్షలు…
మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత 18 నుంచి పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్లో ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్ధులకు పరీక్షలు మొదలవుతాయి. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఉపాధ్యాయులు పరీక్షల నిర్వహణలో బిజీగా ఉంటారు. ఈ నెల 28 వరకు కుల గణన సర్వే పూర్తి అయిన తర్వాత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీలో, గవర్నర్ చేత బిల్లు ఆమోదింపజేయాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అంతేకాదు ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదనే చర్చ జరుగుతుంది. దీంతో ఆశావహులు నిరుత్సాహంలో ఉన్నారు.
రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు…
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కులగణన చేపట్టింది. గతంలో సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే చేపడుతోంది. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుండటంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో తాము బరిలో ఉంటామని చెబుతూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే పల్లెల్లో జోరుగా విందు కార్యక్రమాలు చేపడుతూ జోరుగా ఖర్చు పెడుతున్నారు.