చేర్యాల, అక్టోబర్ 29: నాలుగు మండలాల ప్రజలకు దిక్కున్న చేర్యాల సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమస్యలు రాజ్యమేలుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.మంగళవారం దవాఖానకు ఆయన సందర్శించి అన్ని వార్డులు, ల్యాబ్, ఎక్స్‌రే డిపార్ట్మెంట్, ఫార్మసీ, పీపీపీ యూనిట్ తదితర వాటిని పరిశీలించి సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దవాఖానలో పని చేస్తున్న వైద్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వైద్యసేవలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో మాతాశిశు మరణాల రేటు తగ్గించామని, దేశంలోనే ఉత్తమ వైద్యసేవలు తెలంగాణలో అందుతున్నాయనే స్ధాయికి తీసుకుపోయినట్లు తెలిపారు. తల్లీపిల్లల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, పిల్లల కోసం న్యూట్రీషియన్ కిట్, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు,మగబిడ్డ పుడితే రూ.12వేలు, గర్భిణులకు అమ్మఒడి ద్వారా అత్యుత్తమ సేవలు అందించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ సర్కారు వచ్చాక వైద్యసేవలు సక్రమంగా అందడం లేదన్నారు. అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు.బీఆర్ఎస్ హయాంలో చేర్యాల దవాఖానకు నూతన భవనం మంజూరు చేసిందని, నూతన భవనం నిర్మా ణం 80శాతం మేరకు పనులు పూర్తి అయినట్లు తెలిపారు. దవాఖానలో ఓపీ చూసే ప్రదేశంలో స్లాబ్ పెచ్చులూడుతున్నదని, ఇలాంటి వాతావరణంలో వైద్యులు ఏ విధంగా సేవలు అందిస్తారని ప్రశ్నించారు.ప్రభుత్వ దవాఖానలో స్త్రీ వైద్య నిపుణురాలు లేకపోవడం విడ్డూరంగా ఉందని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు రావడం లేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వైద్యులను, సిబ్బందిని సమస్యలను అడిగి తెలుసుకున్నానని, త్వరలో హెల్త్ మినిస్టర్‌తో పాటు హెల్త్ సెక్రటరీని కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరనున్నట్లు తెలిపారు.
జిల్లా అధికారులు స్పందించి చేర్యాల దవాఖానలో డిజిటల్ ఎక్స్‌రే, ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్ల్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్, బీఆర్ఎస్ టౌన్, మం డల అధ్యక్షులు ముస్త్యాల నాగేశ్వర్రావు, అనంతుల మల్లేశం, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముస్త్యాల బాల్‌నర్సయ్య, మాజీఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్,యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలు, గదరాజు చందు, బీఆర్ఎస్ నాయకులు పెడుతల ఎల్లారెడ్డి,చొప్పరి సాగర్, గదరాజు యాదగిరి, బండమీది కరుణాకర్,యాట యా దగిరి, మంచాల కొండయ్య, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల మానస, మీస పార్వతి, కోతి దాసు, తాండ్ర సాగర్ తదితరులు పాల్గొన్నారు.