చేర్యాల, డిసెంబర్ 19: జనగామ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు పెండింగ్‌లో ఉన్న దేవాదుల పనులకు రూ.178 కోట్లు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాదుల వద్ద నాలుగు పంపులు ఆన్ చేసి నియోజకవర్గంలోని చెరువులు నింపాలన్నారు. 499 ఎకరాల భూమి సేకరిస్తే జనగామకు కిందభాగంలో ఉన్న ఆలేరు నియోజకవర్గానికి నీళ్లు వస్తాయన్నారు. వెంటనే నిధులు రిలీజ్ చేసి పనులు ప్రారంభించాలన్నారు. మోటర్లు ఆన్ చేసి కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు విడుదల చేయాలని కోరారు.
గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దేవాదుల పెండింగ్ పనులపై సమస్యలు తెలియజేశామన్నారు. మంత్రి నిర్వహించిన సమావేశంలో మిగిలిపోయిన ప్యాకేజీ ఎనిమిదిలో, ప్యాకేజీ ఏడులో, ప్యాకే జీ రెండుకు సంబంధించి కొద్దిగా భూమిని సేకరించాల్సి ఉన్నదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. దేవాదులకు సంబంధించి 3,400 ఎకరాల్లో 2,972 ఎకరాలు సేకరించారని, ప్యాకేజీ 8లో 430 ఎకరాలు, ప్యాకేజీ 7లో 36 ఎకరాలు, ప్యాకేజీ 2లో 33తో కలిపి 499 ఎకరాలు సేకరించాల్సి ఉన్నదన్నారు. దీనికి సంబంధించి రూ.178 కోట్లు కావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు.
నిధులు విడుదల చేసి భూమిని సేకరిస్తే జనగామతో పాటు ఆలేరు నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తపాస్‌పల్లి పైపు లైన్లు ఓపెన్ చేసి నీటిని తరలించుకుపోవడంతో జనగామ నియోజకవర్గంలో చెరువులు నిండడం లేదన్నారు. ఆలేరు వాళ్లు నీళ్లు తీసుకుపోవడం వల్ల వారికి, మాకు ఘర్షణ తలెత్తుతుందన్నారు. ధర్మసాగర్ నుంచి గండిరామారం తర్వాత తపాస్‌పల్లి మొత్తం రిజర్వాయర్లు నింపితే యాసంగికి సంబంధించి చెరువులకు నీళ్లు వస్తాయన్నారు. సిస్టమ్ రెడీగా ఉన్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, నాలుగు పంపులు ఉంటే ఒక పంపు సగం రోజు ఆన్ చేస్తున్నారని, అన్ని పంపులు ఆన్ చేస్తే రిజర్వాయర్లు నిండి రెండు నియోజకవర్గాల్లోని అన్ని చెరువులు నిండుతా యని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.