చేర్యాల, సెప్టెంబర్ 25 : తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకైన బతుకమ్మ ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వంగా నిర్లక్ష్యం వహించి నిర్వీర్యం చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు.బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలుయాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ వాల్పోస్టర్లను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విద్యార్థి నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలందరికీ చీరలు ఇచ్చి కేసీఆర్ గౌరవించారని, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు ఇవ్వడం లేదన్నారు. బతుకమ్మకు కేసీఆర్ ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువస్తే , నేటి పాలకులు ఏర్పాట్లు చేయడం లేదన్నారు. బతుకమ్మ పండుగ కొందరికి పరిమితం కాదని, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు.పువ్వులను పూజించే సంస్కృతి కేవలం తెలంగాణ సొంతం అన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం నుంచి సైతం బతుకమ్మ చిహ్నం లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ పాలకులు దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు ఒగ్గు శ్రీశైలం, తాండ్ర ఆంజనేయులు, ఎర్రోళ్ల యాదగిరి, తాండ్ర సాగర్, బంగారిగళ్ల కిరణ్కుమార్, గోనేపల్లి మహేశ్, కొలిపాక శ్రీనివాస్, రవి, నరేష్, హరి, శ్రీను, వినోద్, మహిపాల్ పాల్గొన్నారు.