చేర్యాల, మే 31: తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ సొంతమని, అతిపెద్ద బహిరంగ సభలు నిర్వహించిన ఘనత కేసీఆర్‌కే చెల్లిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం మొత్తం మళ్ల్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న జరిగే ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు డల్లాస్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా కరీంనగర్లో నిర్వహించిన శంఖారావం సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారని గుర్తుచేశారు.
కరీంనగర్ శంఖారావం సభ దేశ చరిత్రలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద సభగా విజయవంతమైందని పేర్కొన్నారు. గతనెలలో ఎల్కతుర్తిలో జరిగిన సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారని, సభకు రాలేకపోయిన లక్షలాది మంది జనం రోడ్ల పైన ఉండగా.. ఎంతోమంది టీవీలో సభను వీక్షించినట్లు గుర్తుచేశారు. ఎల్కతుర్తి సభ స్ఫూర్తితో డల్లాస్‌లో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి కేసీఆర్ గమ్యాన్ని ముద్దాడారని, బీఆర్ఎస్ హయాంలో పదేండ్ల పాలనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నట్లు తెలిపారు.
తాగు, సాగు నీరు వెతలు తీర్చారని, రియల్ వ్యాపారం ఎంతో వృద్ధి చెందిందని, సంక్షేమం, అభివృద్ధి పనులు చేపట్టి కేసీఆర్ తెలంగాణను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపారు. నేటి డల్లాస్ సభ విజయవంతానికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి ఇటీవల ఓ సర్వే చేయించారని, 12 అసెంబ్లీ స్ధానాలకు 12 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందనే విషయం సర్వేలో తెలిసిందన్నారు.