చేర్యాల, జనవరి 27: ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసినా, ప్రజాసేవ కొనసాగించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని వీరభద్ర ఫంక్షన్ హాలులో కమిషనర్ నాగేందర్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పాలకవర్గం వీడ్కోలు సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే తన ధ్యేయమని, మున్సిపల్ చైర్పర్సన్, సభ్యులు పదవీకాలం ముగిసినప్పటికీ వార్డుల్లో దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం అసెంబ్లీలో చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశంపై మాట్లాడానని, చారిత్రాత్మక ప్రాంతమైన చేర్యాల డివిజన్ ఏర్పాటు విషయం సీఎంతోపాటు మంత్రులకు విజ్ఞప్తి చేశానని, అన్ని వర్గాలను కలుపుకొని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధిస్తామన్నారు. ఎమ్మెల్సీగా పనిచేసిన తొమ్మిదేండ్లలో పార్టీలకు అతీతంగా అన్నివర్గాల సమస్యలు పరిష్కరించానని, ఆ పార్టీ, ఈ పార్టీ అనే విషయాన్ని పట్టించుకోలేదని, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ప్రజాప్రతినిధులు అవుతారని, ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే వారే బుద్ధి చెబుతారన్నారు.
అధికారులు సైతం ప్రజాప్రతినిధులకు సహకరించాలని, పదవీకాలం ముగిసింది వారితో మనకు ఏం పని అనుకోవద్దని, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చిన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకుపోతే వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. చేర్యాల మున్సిపల్ పాలవకవర్గం అన్ని విధాలుగా పట్టణాన్ని అభివృద్ధి చేసిందని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకువచ్చి చేర్యాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణిశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్‌గౌడ్, జుబేదాఖాతూన్ ఎక్బాల్, యాట కనకమ్మ యాదగిరి, చెవిటి లింగం, ఆడెపు నరేందర్, ముస్త్యాల తారాయాదగిరి, ఉడుముల ఇన్నమ్మభాస్కర్రెడ్డి, తుమ్మలపల్లి లీలాసంజీవులు, సందుల సురేశ్, కోఆప్షన్ సభ్యులు ముస్త్యాల నాగేశ్వర్రావు, ఆరోగ్యరెడ్డి, జేబాబేగంలను కమిషనర్ నాగేందర్, మేనేజర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ కృష్ణ, మున్సిపల్ వార్డు అధికారులు, సిబ్బందితో కలిసి శాలువా కప్పి, మెమోంటోలు అందించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే పల్లాను సన్మానించారు.
ప్రజాజ్యోతి, ఆంధ్రప్రభ దినపత్రికలు రూ పొందించిన క్యాలెండర్లు, డైరీలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విలేకరులు శ్రీకాంత్, కరుణాకర్లతోపాటు పలువురు జర్నలిస్టు యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్రికలు, మీడియా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తాడెం రంజితాకృష్ణమూర్తి, చేతిరెడ్డి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లాను పలువురు వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు.