కొమురవెల్లి, నవంబర్ 12 : తెలంగాణలో పశువులను పూజించే గొప్ప సంస్కృతి ఉందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి యాదవసంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సదర్ పండుగను ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. ప్రసుత్తం కూడా అది అలాగే కొనసాగాలని కోరారు. మొదటి నుంచి హైదరాబాద్‌లో సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించేవారని, నిజాం రాజు సైతం హాజరయ్యేవాడన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే సదర్ ఉత్సవం నేడు జిల్లాలకు వ్యాపించిందన్నారు.
యాదవులు తమకు జీవనభృతి కల్పించిన పశువులను పూజించడం వారి సంప్రదాయమని, యాదవులు అందరికీ సాయం చేస్తారన్నారు. మా ఊరులో ఇంటి చుట్టూ యాదవులే ఉంటారని, వాళ్లను మామ, చిచ్చా అంటూ వరుసలతో పిలుచుకుంటామని తెలిపారు. ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహించి తనను ఆహ్వానించిన యాదవసంఘం సభ్యులను ఎమ్మెల్యే పల్లా అభినందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి, మాజీ ఎంపీపీ తలారి కీర్తనాకిషన్, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాలనర్సయ్య, బొంగు రాజేందర్‌రెడ్డి, పచ్చిమడ్ల స్వామిగౌడ్, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, ఏర్పుల మహేశ్, పుట్ట కనకరాజు, గొల్లపల్లి కిష్టయ్య, శివగారి అంజ య్య, పచ్చిమడ్ల మానస, బుడిగె రమేశ్‌గౌడ్, యాదవ సంఘం నాయకులు వినయ్, హరిశ్, యాదవ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.