చేర్యాల, ఫిబ్రవరి 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల-సిద్దిపేట రహదారిలో తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు, చిట్యాల, కమలాయపల్లి, దానంపల్లి, అర్జునపట్ల గ్రామాలకు వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డు గుంతలమయమైంది. దీంతో నిత్యం ఈ రోడ్డుపై వెళ్తున్న నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంబంధితశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేసి ఇటీవల రూ.8 కోట్లను మంజూరు చేయించారు.
సదరు నిధులతో 9.70కిలోమీటర్ల గ్రామీణ రోడ్డుకు మరమ్మతు చేసి డాంబర్ వేయనుండడంతో ఆయా గ్రామాల ప్రజలకు మేలు చేకూరనున్నది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి తాడూరులో ఎమ్మెల్యే ఫ్లెక్సీకి ఆదివారం క్షీరాభిషేకం చేశారు.అనంతరం పలువురు మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి నిధులు మంజూరు చేయిస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు పద్ధతులు అవలంభిస్తున్నారని వాటిని మానుకోవాలని హితవుపలికారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, సర్పంచ్ల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, నాలుగు మండలాల యూత్ ఇన్చార్జి శివగారి అంజయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసుతో పాటు మండల ముఖ్య నాయకులు, తాడూరు, చిట్యాల, కమలాయపల్లి, దానంపల్లి, అర్జునపట్ల గ్రామాల ముఖ్య నాయకులు నర్ర ఉపేందర్‌రెడ్డి, ఈరు ఐలయ్య, లక్ష్మణ్, బంగారి సంపత్, మిట్టపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములు, రాచకొండ కనకయ్య, రాజు పాల్గొన్నారు.