చేర్యాల, మే 8: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, హత్యలు, దాడులే ప్రగతిగా మారాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాలు, ఎమ్మెల్యేలపై రోజురోజుకూ పెరిగిన దాడుల నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. మతం పేరుతో రాజకీయ లబ్ధి కోసం గంగుల కమలాకర్ కార్యాలయంపై దాడి చేశారని, పెట్రోల్, బాంబులతో వచ్చి కౌశిక్‌రెడ్డిని చంపే ప్రయత్నం చేశారన్నారు. ప్రజాప్రతినిధులకు రక్షణ లేకుండా పోయిందని, బండి సంజయ్ రెచ్చగొట్టడంతోనే హింసాత్మక దాడులకు కారణమన్నారు.
కరీంనగర్ జిల్లాలో పోలీసులు పూర్తి స్థాయి లో వైఫల్యం చెందారని, అడ్వకేట్‌పై ఆయుధాలతో దాడి చేసినా కేసు నమోదు చేయలేదన్నారు.క్రిశాంక్‌పై అక్రమ కేసులతో ప్రతిపక్షం గొంతు నొక్కేప్రయత్నం చేస్తున్నారన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే పోరాటం సాగుతుందన్నారు. కేటీఆర్‌పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మతం పేరుతో రెచ్చగొట్టడం తప్పా ప్రజలకు లాభం లేదన్నారు. కేంద్ర మంత్రి హోదాలో రాష్ర్టానికి ఒక్క రూపాయి తీసుకురాలేదన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసిందన్నారు.