చేర్యాల, డిసెంబర్ 19: బీఆర్ఎస్ సైనికుల వీరోచిత పోరాటం వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం లభించిందని, గులాబీ శ్రేణులు రానున్న ఎన్నికలకు సిద్ధం కావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని రేణుకా గార్డెన్స్‌లో శుక్రవారం చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల్లో కేసీఆర్‌పై చెక్కు చెదరని అభిమానం ఉందని పంచాయతీ ఎన్నికలు నిరూపించినట్లు తెలిపారు. కేసీఆర్ సైనికులే వారి నాయకులను గెలిపించుకున్నారని అన్నారు.
అధికార కాంగ్రెస్ పోలీసులు, అధికారుల అండతో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, అభ్యర్థులను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా మొక్కవోని దీక్షతో పనిచేసి విజయం సాధించినట్లు తెలిపారు. పార్టీలోనే ఉంటూ కుట్రలు, కుతంత్రాలు చేసిన వారిని ఇప్పటికే గుర్తించానని, వారిపై సరైన సమయంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్‌లుగా ఓడిపోయిన గ్రామాల్లో పార్టీ పరంగా వారే మా సర్పంచ్‌లని, వారికి తాను అండగా ఉంటానని, సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రచారం సాగించినా ప్రజలు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ అధికారంలో ఉనప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం స్థ్ధానాల్లో విజయం సాధించామన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి పంచాయతీ ఎన్నికల పై విజయాల పై తప్పుడు లెక్కలు చెప్పారని విమర్శించారు. జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వగ్రామంలో ఓటు హక్కు లేనప్పటికీ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలో ఎన్నికల సందర్భంగా కుర్చీ వేసుకుని ఓటుకు రూ.5వేలు ఇచ్చినా ప్రజలు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేయలేదన్నారు. అధికారం, డబ్బులు ఎన్ని ఖర్చు చేసినా బీఆర్ఎస్ శ్రేణులు వాటిని తిప్పికొట్టాయని, చేర్యాల ప్రాంతంలో అత్యధిక స్ధానాల్లో బీఆర్ఎస్కు విజయం సాధించిపెట్టిన ప్రజలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
సమావేశంలో మాజీ ఎంపీపీలు వుల్లంపల్లి కరుణాకర్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం,మేక సంతోష్, మంద యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ నాగిల్ల తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, ముస్త్యాల బాల్‌నర్సయ్య, మాజీ జడ్పీటీసీలు సిలువేరు సిద్దప్ప, నాచగోని పద్మవెంకట్గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జింకల పర్వతాలు యాదవ్, గదరాజు చందు, మహిళా నాయకురాళ్లు పచ్చిమడ్ల మానస, తాడెం రంజితాకృష్ణమూర్తితో పాటు నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.