సిద్దిపేట, డిసెంబర్ 7: సిద్దిపేటలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పరుగులు పెట్టిన అభివృద్ధి కాంగ్రెస్ వచ్చాక కుంటుపడిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెంది న సీనియర్ నాయకుడు పైస రామకృష్ణ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. హరీశ్‌రావు వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్దిపేట ప్రజలపై కక్ష కట్టిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరైన అనేక పనులు రద్దు చేసిందన్నారు.
అనేక పనులు అసంపూర్తిగా ఆపేసిందని తెలిపారు. రంగనాయకసాగర్ టూరిజం ప్రాజెక్టు, శిల్పారామం, దవాఖాన, రోడ్లు, ఇతర ఎన్నో పనులు అర్ధాంతరంగా ఆపారన్నారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అని విమర్శించారు. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా ప్రయోజనాలు పట్టవా.. ఏడాదిలో సిద్దిపేటకు ఒక్క మంచి పని చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధి కోసం పోరాటం చేస్తానని, అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రశ్నిస్తానని పేర్కొన్నారు.
రద్దు చేసిన పనులు ప్రారంభమయ్యే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టనన్నారు. ఎలా ఉన్న సిద్దిపేట ఎలా అయ్యిందని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన సిద్దిపేట అభివృద్ధి అటకెక్కిందని పైస రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం, హరీశ్‌రావు విలువ తెలిసి వచ్చిందన్నారు. కష్టమైనా, నష్టమైనా బీఆర్ఎస్ పార్టీ, హరీశ్‌రావుతోనే ఉంటానని.. సిద్దిపేట అభివృద్ధి జరగాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు.