నిజాంపేట,సెప్టెంబర్7: బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో సరిపడా విత్తనాలు,ఎరువులు,రైతు బంధు,బీమా పథకాలతో మాజీ సీఎం కేసీఆర్ రైతులకు భరోసా కల్పిస్తే కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గండిపడ్డ మెదక్ జిల్లా తిప్పనగుల్ల హైదర్చెరువు,ధ్వంసమైన మల్లన్నసాగర్ కాల్వను ఆమె ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. యూరియా కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న ఘటనలు రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సిద్దిపేట -మెదక్ ప్రధాన రహదారిపై మూడు చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసమై వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పునర్నిర్మాణ పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి నామమాత్రంగా పర్యటించడమే తప్పా నిర్మాణ పనులకు నిధులు కేటాయించడం లేదని ఎద్దేవా చేశారు.రోడ్డు మరమ్మతు పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సిద్దిపేట -మెదక్ రోడ్డు ను త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేని పక్షంలో ప్రజల తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారీ వర్షాలతో మెదక్ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలకులు పాలనను గాలికి వదిలేశారని,కనీసం అధికారులైనా తిప్పనగుల్ల హైదర్చెరువుకు మరమ్మతు చేయించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు సుధాకర్‌రెడ్డి, మండల కో-ఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్అజీజ్, మాజీ చైర్మన్ కిష్టారెడ్డి,నాయకులు వెంకటస్వామిగౌడ్, నరేందర్‌నాయక్, స్వామి,రంజిత్‌గౌడ్,లక్ష్మణ్,సుభాశ్‌నాయక్, రైతులు పాల్గొన్నారు.