వెల్దుర్తి, ఆగస్టు 4: 420హామీలు, ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా వెల్దుర్త్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శేరీ సుభాష్‌రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, మంత్రులకు సుతిలేదని, దీంతో పరిపాలన ముందుకు సాగడం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనతో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, కేసీఆర్ పాలనే బాగుందని గుర్తు చేసుకుంటున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హామీ లు,పథకాలు గుర్తుకు వస్తాయని, ఎన్నికల అనంతరం వాటిని మర్చిపోతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని రైతుబంధును యాది చేసుకొని కొంత మేర రైతుల ఖాతాల్లో వేశారని, గ్రామాల్లో 40 శాతం కంటే పంట రుణమాఫీ ఎక్కువ కాలేదన్నారు. మహాలక్ష్మి పథకం అటకెక్కగా, పెంచిన పింఛన్ల కోసం అన్ని వర్గాల లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి మద్దతు తెలిపిన నిరుద్యోగులు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, నిరుద్యోగభృతి రాక తిప్పలు పడుతున్నారన్నారు. ఏ మీడియాను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడో ఆవిషయాన్ని కూడా మర్చిపోయి అధికారంలోకి రాగానే ఆమీడియా పైన కూడా సీఎం తిట్ల వర్షం కురిపిస్తున్నాడని ఆరోపించాడు.
మెదక్ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాల్లో వేర్వేరు రకాల పరిపాలన జరుగుతుందన్నారు. పదేండ్ల కేసీర్ పాలనలో ప్రతిపక్షానికి, అధికార పక్షానికి ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిపాలన సాగిందని,కానీ కాంగ్రెస్ పాలనలో మెదక్ నియోజకవర్గంలో ఓ అరాచకం, నర్సాపూర్ నియోజకవర్గంలో ఇంకోరకం అరాచకం జరుగుతుందన్నారు. నర్సాపూర్‌లో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఉన్నా ప్రొటోకాల్ పట్టించుకోకుండా ఉల్లంఘించి అధికార పార్టీ నాయకులు చెక్కులు ఎలా పంచుతారని ప్రశ్నించారు.
రైతాంగం పక్షాన నిలబడి సన్న వడ్లకు బోనస్ రాని సందర్భంగా మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 7న కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సునీతాక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వర్షాలు సరిగ్గా పడకపోతే వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, సాగునీటి సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
సింగూరు నుంచి మంజీరాలోకి, కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదన్నారు. సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, మాజీ జిల్లా వైస్‌చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జిల్లా నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బట్టి జగపతి, వెల్దుర్తి, బీఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షులు భూపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డితో పాటు జిల్లాలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.