నిజాంపేట, మే 18: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల వద్ద గన్నీబ్యాగుల కొరత వల్ల ఎక్కడి ధాన్యం అక్కడే ఉందన్నారు. లారీల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత వల్ల తూకం వేసిన ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నాయన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంట వెంటనే కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 24 గంటలపాటు నిరంతరం నాణ్యమైన కరెంట్, సరైన సమయంలో రైతు బంధు అందజేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారని గుర్తుచేశారు. బీఆర్ఎస్, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల పోరాటం వల్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయిభగీరథ్‌ను అరెస్ట్ చేశారన్నారు. కస్టడిలోకి తీసుకున్న సాయిభగీరథ్‌పై విచారణ సరైన రీతిలో జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు.
సాయిభగీరథ్‌ను అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడంతో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని మరోసారి రుజువైందన్నారు. సమావేశంలో మెదక్ మున్సిపాల్ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, రామాయంపేట మున్సిపాల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, రామాయంపేట, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు బాదే చంద్రం, బాపురెడ్డి, మండల కో-ఆప్షన్ మాజీ సభ్యుడు అబ్దుల్అజీజ్, మాజీ సర్పంచ్ తిరుమల్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు తిరుమల్‌గౌడ్, రంజిత్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, శివలింగం, రాజుగౌడ్ పాల్గొన్నారు.