రామాయంపేట, ఫిబ్రవరి 6: ఆరు గ్యారెంటీలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని మూడో వార్డులో శుక్రవారం ఇంటింటికీ తిరిగి ఆమె ఎన్నికల ప్రచారం చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే పల్లెలు, మున్సిపాలిటీలు బాగుపడ్డాయన్నారు. కేసీఆర్ సారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పురపాలికలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. ప్రజలు ఆ పార్టీకి చుక్కలు చూపించడం పక్కా అన్నారు. ఉచిత బస్సు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సమయానికి బస్సులు లేక ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, మాజీ వైస్ చైర్పర్సన్ పుట్టి విజయలక్ష్మి, మూడో వార్డు అభ్యర్థి లంబాడి శ్రీనువాస్నాయక్, బాదె చంద్రం, అస్నొద్దీన్, భిక్షపతి, ఉమామహేశ్వర్, బాసం శ్రీనువాస్ పాల్గొన్నారు.