రామాయంపేట, ఏప్రిల్ 12 : ప్రజలంతా మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, రానున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆపార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేటలోని ఓ ప్రైవేట్ చిన్న పిల్లల దవాఖానను బీఆర్ఎస్ నేత కంఠారెడ్డి తిరుపతితో కలిసి ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ అన్నిరంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకుని, నేడు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్‌రెడ్డికి ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదన్నారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని, కేసీఆర్ వస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు.
మూడేండ్లుగా రాష్ట్రంలో ఆడబిడ్డలకు పింఛన్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పాటు తులం బంగారం హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వాగ్ధ్దానాలను నెరవేర్చాలని ఆమె కోరారు.వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కరోనా సమయంలో వైద్యులు దేవుళ్లలా సేవలు అందించారని అన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారికి జీవం పోసేది వైద్యులేనని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు జారుబాయి, రమేశ్ బీర్నుర్, వాణిశ్రీ, మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తదితర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.