హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): అధునాతన వైద్య సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) మరో కీలక మైలురాయిని చేరుకుంది. మూడు సంవత్సరాల్లోనే 1,000 రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తిచేసి నిమ్స్ వైద్యులు చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ వైద్యరంగ చరిత్రలోనే తొలిసారిగా 2023 ఆగస్టులో నిమ్స్ వైద్యులు రోబోటిక్ సర్జరీలు ప్రారంభించారు. ఈ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచితంగా నిర్వహించడం విశేషం. రోబోటిక్స్ సర్జరీల్లో రోగులకు నొప్పి తగ్గుతుందని, త్వరగా కోలుకుంటారని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. అధునాతన చికిత్సాపద్ధతులను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తేవడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు.
యురాలజీలో 590 సర్జరీలు
నిమ్స్‌లో ఇప్పటివరకు నిర్వహించిన 1,000 రోబోటిక్ సర్జరీల్లో 590 యురాలజీ విభాగంలో జరిగాయి. ఏడాది చిన్నారుల నుంచి 80 ఏండ్లు దాటిన వృద్ధుల వరకు ఈ శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు రాడికల్ ప్రోస్టేటెక్టమీ, మూత్రాశయ క్యాన్సర్‌కు సిస్టెక్టమీ, క్లిష్టమైన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, యూరో-గైనకాలజీ, యూరో-రీకన్స్ట్రక్టివ్ సర్జరీలు, బోయారి ఫ్లాప్, యూరెటెరిక్ రీ-ఇంప్లాంటేషన్ , పైలోప్లాస్టీ, చిన్నారుల పైలోప్లాస్టీ వంటి సంక్లిష్ట శస్త్రచికిత్సలు ఇందులో ఉన్నాయి. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో 248 రోబోటిక్ సర్జరీలు జరిగాయి. సర్జికల్ ఆంకాలజీ విభాగంలో 162 రోబోటిక్ సర్జరీలు పూర్తయ్యాయి. అండాశయ, గర్భాశయ, కొలొరెక్టల్ క్యాన్సర్లకు కచ్చితత్వ శస్త్రచికిత్సలు నిర్వహించారు.
90 శాతానికి పైగా సర్జరీలు ఉచితంగానే…
వెయ్యి రోబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ తదితర ఆరోగ్య పథకాల ద్వారా రోగులకు ఉచితంగానే నిర్వహించారు. కాగా రోబోటిక్ సర్జరీలపై సాధారణంగా ఉండే అధిక వ్యయ భారాన్ని తగ్గించి, అత్యాధునిక వైద్య సేవలను సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిమ్స్ ప్రభుత్వ వైద్యరంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.
సమష్టి కృషితోనే సాధ్యమైంది: నిమ్స్ డైరెక్టర్
ఈ చారిత్రక మైలురాయి సాధించడంలో యురాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియాలజీ, నర్సింగ్ సర్వీసెస్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, ఇతర సహాయక విభాగాల కృషిని నిమ్స్ డైరెక్టర్, యూరాలజీ-రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సీనియర్ ప్రొఫెసర్, రోబోటిక్ సర్జరీ కోఆర్డినేటర్ డాక్టర్ రాహుల్ దేవ్‌రాజ్ అభినందించారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, సిబ్బంది సమన్వయంతో చేసిన నిరంతర కృషి ఫలితంగానే 1,000 రోబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకున్నామని ఆయన తెలిపారు. రోబోటిక్ ఆధారిత సర్జరీల్లో నిమ్స్‌ను జాతీయ స్థాయి అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని పేరొన్నారు.