రామాయంపేట, మార్చి 27: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతూ బీఆర్ఎస్ నాయకులను మభ్యపెట్టి పార్టీలో చేర్చుకోవడం ఇప్పటికైనా మానుకోవాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి హితవు పలికారు. శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఆమె సమక్షంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ కొక్కు ప్రవీణ్ సొంతగూటికి చేరుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ పట్టణ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి మూడేండ్ల పొద్దు గడుస్తుంది, ఇప్పటికీ ఒక్క అభివృద్ధి జాడలేదన్నారు.
బీఆర్ఎస్ నాయకులను మభ్యపెట్టి పార్టీలోకి చేర్చుకోవడం మంచిపద్ధతి కాదన్నారు.అభివృద్ధి కావాలని మీ వద్దకు వస్తే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండని ప్రచారం చేసుకుంటారా.. ఇది మీకు, మీ సీఎం రేవంత్‌రెడ్డికే చెల్లిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. ఉద్యమకారులు బీఆర్ఎస్లో ఉన్నారు వారు ఇతర పార్టీల్లోకి వెళ్లరని గుర్తుచేశారు.ఇప్పటికైనా బెదిరించడం, కేసులు నమోదు చేస్తానని చెబితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, సీనియర్ నాయకుడు చౌదరి సుప్రభాతరావు, అస్నొద్దీన్, అల్లాడి వెంకటేశ్, వినయ్‌సాగర్, కౌన్సిలర్లు చౌదరి చరిత, మద్దెల మాధవి, ప్రవీణ్, సిద్ధిరాంరెడ్డి ఉన్నారు.