మెదక్, ఏప్రిల్ 6(నమస్తే తెలంగాణ): ఘనపూర్ ఆనకట్టకు ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు ఆమె వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం సింగూరు ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో రైతులు ఘనపూర్ ఆనకట్ట కింద వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగుచేశారన్నారు. ఘనపూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ లేక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు.
బీఆర్ఎస్ డిమాండ్ మేరకు ప్రభుత్వం సింగూరు ప్రాజెకు నుంచి నీటిని విడుదల చేసినా సంగారెడ్డి సమీపంలో ఉన్న మంజీరా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం లేదన్నారు. హైదరాబాద్ అవసరాల కోసం మంజీరా డ్యామ్‌లో నీటి నిల్వ ఉంచామని అధికారులు చెబుతున్నారన్నారు. ప్రభు త్వం వెంటనే మంజీరా డ్యామ్ నుంచి ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేయాలన్నా రు. ప్రభుత్వం ముందుగా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులు వరిసాగు చేసిన తర్వాత ప్రభుత్వం ఘనపూర్ ఆనకట్ట కింద వరి సాగు చేయరాదని క్రాప్ హాలిడే ప్రకటించిందన్నారు. ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు రైతు భరోసా, రైతు బీమా డబ్బులు ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయరంగానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా సరఫరా చేయడం లేదన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అసెంబ్లీలో సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని కోరగా ప్రభుత్వం కమిటీ వేసి నీటిని విడుదల చేస్తామని ప్రకటించిందన్నా రు. అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పినా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ మెదక్ మండల అధ్యక్షుడు అంజగౌడ్, హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ బట్టి ఉదయ్‌కుమార్, జూబేర్, గౌస్, బీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, ప్రభురెడ్డి, ఆర్కే.శ్రీనివాస్, స్వామినాయక్, ఆంజనేయులు పాల్గొన్నారు.