మెదక్, జూన్ 29(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కొత్తగా జారీ చేసే పోలీస్ నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు ప్రాధాన్యం కల్పించాలని, 19 వేల పోస్టులతో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ పట్టణంలో ఉన్న జిల్లా గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగుల సమస్యలను ఆమె తెలుసుకున్నారు.
అనంతరం వారితో కలిసి మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా 5 వేల పోస్టులకు నోటిఫికేషన్ వస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాంట్లో మెదక్ జిల్లాకు పోస్టులు చూపించలేదన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుపై పోలీస్ శాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాకు సంబంధించిన పోస్టు లు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. పోలీస్ నోటిఫికేషన్లో మెదక్ జిల్లాకు పోస్టులు వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు ఆమె కోరారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో 38 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పోలీస్‌శాఖలో 19 వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5 వేల పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లా కేంద్రం లో ఉన్న గ్రంథాలయంలో నిరుద్యోగులు చదువుకునేందుకు సమయం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉందని, రాత్రి 9 గంటల వరకు సమయం పెంచాలని కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కోరారు.
గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, సౌకర్యాలు కల్పించాలన్నారు. రాత్రి 8 గంటలకు గ్రంథాలయం మూసివేయడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ స్పందించి నిరుద్యోగులు చదువుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్త్తామని హామీ ఇచ్చారు. మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయు లు, బీఆర్ఎస్ నాయకుడు, ఏఎం సీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, హవేళీ ఘనపూర్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, చిన్నశంకరంపేట అధ్యక్షుడు రాజు, మున్సిపాల్ కౌన్సిలర్ జుబే ర్, బట్టి ఉదయ్‌కుమార్, మాయ మల్లేశం, దీపక్‌కుమార్, బీఆర్ఎస్ నాయకుడు లింగారెడ్డి, మహేశ్, కృష్టయ్య, ఆర్కే శ్రీనివాస్ పాల్గొన్నారు.