మెదక్ అర్బన్, జూలై 8 : ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణ పనులు నిలిపివేయాలని కోరుతూ కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామాల పరిధిలో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ విస్తరణ పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
పరిశ్రమ ఏర్పాటైనప్పుటి నుంచి రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి వెలువడుతున్న గాలి, నీటి కాలుష్యంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయన్నారు. కంపెనీ నుంచి విడుదలవుతున్న కాలుష్యం వల్ల భూగర్భజలాలు కలుషితం కావడంతో ప్రజలు అనా రోగ్యాలకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాస్వామ్య బద్ధంగా లేదని, వెంటనే కంపెనీని రద్దు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కంపెనీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రంగాయిపల్లి, చెట్లగౌరారం గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.