మెదక్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని, కొట్టుకుపోయిన రోడ్లను, కోతకు గురైన చెరువు గండ్లను, కాల్వలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాం డ్ చేశారు. వర్షాలకు జలదిగ్బంధంలో చిక్కుకున్న హవేళీఘనపూర్ మండలంలోని దూప్‌సింగ్ తండా బాధితులను శనివారం ఆమె పరామర్శించారు. తండాలో ఇంటింటా తిరిగి ధైర్యం చెప్పారు.
రాజ్పేట్లో వరదలో కొట్టుకుపోయి మృతి చెందిన యాదవ్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దూప్‌సింగ్ తండా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో తండావాసులు సమీపంలోని గుట్టపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారని, వారికి తాగడానికి నీరు, ఆహారం లేక అలమటించారని, సహాయక చర్యలు చేపట్టడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బూర్గుపల్లి వద్ద రోడ్డు కోతకు గురై వాడి, రాజ్పేట్, కొత్తపల్లి, కప్రాయిపల్లి, కప్రాయిపల్లి తండా, దూప్‌సింగ్ తండాకు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. దూప్‌సింగ్ తండాకు బీఆర్ఎస్ హయాంలో రూ.3 కోట్లతో బ్రిడ్జి మంజూరైందన్నారు. కాంట్రాక్టర్ 40శాతం నిర్మాణ పనులు పూర్తి చేశాడని, అంతలోనే ప్రభుత్వం మారిందన్నారు.
కాం ట్రాక్టర్‌కు ఎన్వోసీ ఇవ్వనందున బ్రిడ్జి పని చేయలేకపోయాడని, రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంతో పనులు కావడం లేదన్నారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌కు ఎన్వోసీ ఇప్పించి పనులు తొందరగా పూర్తిచేసి తండా వాసుల ఇబ్బందులు తొలిగించాలని పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆమె వెంట జడ్పీ మాజీ వైస్‌చైర్‌పర్సన్ లావణ్యరెడ్డి, హవేళీఘనపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు యామిరెడ్డి, సాయిలు, చిన్నాగౌడ్, సాయాగౌడ్, నాయకులు సిద్ధ్దిరాం రెడ్డి, భిక్షపతి రెడ్డి, సతీశ్‌రావు, బాల్‌రాజ్, రాంచంద్రారెడ్డి, సాయిలు, రవీందర్‌గౌడ్, మల్లయ్య, చంద్రం,అశోక్, సాప సాయిలు, శ్రీను నాయక్, రంజిత్, తరుణ్ ఉన్నారు