రామాయంపేట, ఆగస్టు19: లైసెన్స్ సర్వేయర్ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలరోజులుగా విధులకు దూరంగా ఉన్న లైసెన్స్ సర్వేయర్లను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వారికి ఇచ్చే కమీషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్నారు.
గౌరవ వేతనం రూ.30వేలు ఇవ్వాలని, విధి నిర్వహణకు సంబంధించిన టీఏ, డీఏలతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రతి సర్వేయర్‌కు రెండు గ్రామాలు కేటాయించాలన్నారు. సర్వేయర్లు ప్రజలకు, ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థకు కీలకమైన సేవలందిస్తున్నారన్నారు. లైసెన్స్ సర్వేయర్లను ప్రభుత్వం చిన్నచూపు చూస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో 6500 మంది లైసెన్స్ సర్వేయర్లు ఉన్నారని, వారి న్యాయమైన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.