Tatvam | మర్డర్ మిస్టరీ జానర్ సినిమాల్లో ఉండే సరికొత్త ఉత్కంఠ, విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతున్న చిత్రం తత్వం (Tatvam). దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కే. ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్‌పై శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టాలెంటెడ్ డైరెక్టర్ అర్జున్ కోలా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మరియు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన, అనూహ్యమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేట్రికల్ విడుదలకు సన్నద్ధం చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ వేడుకలో ప్రముఖ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘తత్వం’ సినిమాను ఎవరూ అస్సలు మిస్ కాకండి, ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఇండస్ట్రీపై మక్కువతో, సినిమాపై ఉన్న పాషన్‌తో ఎంతో మంది నిజాయితీపరులు తమ ప్రాణం పెట్టి ఈ సినిమాను రూపొందించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ మంచి సినిమా గురించి నలుగురికి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త ప్రయత్నాలను ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకులందరిపై ఉంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఇష్టపడి పనిచేశారు, తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
ఈ చిత్ర దర్శకుడు అర్జున్ కోలా తన సుదీర్ఘ ప్రయాణం గురించి వివరిస్తూ.. ‘ఈ సినిమా ప్రయాణంలో మేము ఎదుర్కొన్న స్ట్రగుల్స్ అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి కష్టాలు ఫేస్ చేసిన తర్వాత మేము మళ్లీ కోలుకుని సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తామని ఎవరూ ఊహించి ఉండరు. ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన తొలిరోజుల్లోనే హీరో హీరోయిన్లకు కారు యాక్సిడెంట్ జరగడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. వాళ్లు పూర్తిగా కోలుకునే వరకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఎట్టకేలకు అక్టోబర్ 2న విడుదల తేదీని ప్రకటించాం. అయితే సడన్‌గా మా టైమ్‌కి బాక్సాఫీస్ వద్ద దాదాపు డజను సినిమాలు బరిలో నిలిచాయి. అయినప్పటికీ మా కంటెంట్ మీద మాకు ఉన్న బలమైన నమ్మకంతో అక్టోబర్ 2న సినిమాను విడుదల చేస్తున్నాం. నేను ఒకవైపు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే, మరోవైపు ఈ సినిమా పనులన్నీ దగ్గరుండి చూసుకున్నాను. సినిమా ట్రైలర్, పాటలు చూసి ఇండస్ట్రీలో అందరూ చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. ఒక మంచి థ్రిల్లర్ మూవీకి కావలసిన అన్ని అంశాలు ఇందులో పరిపూర్ణంగా ఉన్నాయి. ప్రేక్షకులు ఇచ్చిన ఈ స్పందనతోనే సినిమాను ఎలాంటి వెనుకంజ వేయకుండా విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందనే పూర్తి నమ్మకం నాకుంది. అక్టోబర్ 2న ఈ చిత్రం సాధించబోయే సక్సెస్ సెలబ్రేషన్స్‌తో మేము పడిన కష్టాలన్నీ మరిచిపోతాం’ అని ఎమోషనల్ అయ్యారు.
నిర్మాత శీమకుర్తి వంశీ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఎన్నో సవాళ్లను, అడ్డంకులను, స్ట్రగుల్స్‌ను ఎదుర్కొంటూ మేమంతా ఈ స్టేజ్‌కు చేరుకున్నాం. వెండితెరపై మా సినిమాను చూసి, ఆడియన్స్ ఇచ్చే ఆదరణను చూసి మా కష్టాలన్నీ మర్చిపోతామనే నమ్మకం ఉంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నాము’ అని తెలిపారు.
హీరో దినేష్ తేజ్ తన అనుభవాలను పంచుకుంటూ.. ‘మా సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో నాకు, హీరోయిన్‌కు జరిగిన యాక్సిడెంట్‌తో జరిగిన నెగెటివిటీ అంతా మా సినిమాకు దిష్టి తగిలిపోయి పోయిందని భావిస్తున్నాం. మా సినిమా కంటెంట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడటం నాకు నిజంగా రెండో జీవితం లాంటిదే. డెమొ రోజు నేను కథ విన్నప్పుడు నాలో ఎంతైతే నమ్మకం ఉందో, నేటికి ఈ సినిమా విజయంపై అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉంది. ఆడియన్స్‌కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అందరూ నన్ను ‘నీ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, నీ టైమ్ ఎప్పుడు వస్తుంది’ అని అడుగుతుంటారు.. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆ మంచి రోజు వస్తుంది. ఎలాంటి అంచనాలకు పోకుండా నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ ఇలాంటి మంచి సినిమాల్లో నటిస్తుంటాను. కొత్తదనం ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తుంటారు. ఈ సినిమాను కూడా అదే కోవలో పెద్ద సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాకు బలమైన కథే మా ధైర్యం, ఆడియన్సే మా ప్రధాన బలం. ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు విజయం సాధిస్తేనే మా లాంటి వాళ్ళలో మరింత నమ్మకం పెరుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరి మనసులను బలంగా తాకుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
హీరోయిన్ దష్విక మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా అందరి కష్టానికి ప్రేక్షకుల నుంచి పూర్తి స్థాయి సపోర్ట్ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ముగించారు.