మెదక్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : యాసంగి పంటలకు సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆమె వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టు నీటి విడుదల పై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టకు నీటి విడుదల పై ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయడం లేదన్నారు. ప్రభుత్వం నీటి విడుదల పై స్పష్టత ఇవ్వక రైతులు అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘనపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయిస్తారా లేదా క్రాప్‌హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నీటిని విడుదల చేస్తే రైతులు యాసంగిలో పంటలు సాగు చేసుకునే ఆవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే సింగూరు ప్రాజెక్టు నీటి విడుదలపై చర్య లు తీసుకోవాలన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండివైఖరి చూపిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు సాగు చేసిన పంటలకు నీటిని విడుదల చేశామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకువెళ్లకుండా మెదక్ జిల్లాకు నీరు అందించేందుకు కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
వానకాలంలో రైతులు సాగు చేసిన పంటలకు నష్టం జరిగినా ప్రభుత్వం ఇంత వరకు పరిహారం చెల్లించలేదన్నారు. ప్రభుత్వం రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. యాసంగి పంటలకు నీటిని విడుదల చేయకపోతే బీఆర్ఎస్ తరపున పెద్దఎత్తున ధర్నా చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మెదక్ మండల అధ్యక్షుడు అంజగౌడ్, మాజీ ఎంపీపీలు కొత్తపల్లి కిష్టయ్య, దుర్గయ్య, మాజీ కౌన్సిలర్లు విశ్వం, మాయ మల్లేశం, చంద్రశేఖర్, సోహెల్, బీఆర్ఎస్ పట్టణ కో కన్వీనర్లు కృష్ణగౌడ్, లింగారెడ్డి, సర్పంచ్‌లు సాంబశివరావు, మ్యాకల సాయిలు, నాయకులు సోములు, మెడిశెట్టి శంకర్, సాయిలు, రాజు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.