జెరుసలాం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూ నివాసంపై ఇవాళ క్షిపణి దాడి జరిగినట్లు వార్తలు వ్యాపించాయి. ఇరాన్ తన క్షిపణులతో నెతన్యహూ ఇంటిపై అటాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం(Israel PMO) కొట్టిపారేసింది. అవన్నీ నకిలీ వార్తలు అని పీఎంవో పేర్కొన్నది. జెరుసలాంను టార్గెట్ చేశామని, దీంతో నెతన్యహూ ఆచూకీ లేనట్లు కొన్ని వార్తలు ప్రసారం అయ్యాయి. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ దీనిపై ఓ వీడియో ప్రకటన రిలీజ్ చేసింది. ఖైబర్ క్షిపణులతో దాడి చేశామని, నెతన్యహూ ఆఫీసుపై ఆ అటాక్ జరిగిందని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ తోమర్ బ్రార్ ఇంటిపై కూడా ఆకస్మిక దాడి చేసినట్లు ఓ మిలిటరీ ప్రతినిధి తెలిపారు.
అయితే ఆ స్టేట్మెంట్ను ఇజ్రాయెల్ ఖండించింది. జెరుసలాంలో ఎటువంటి క్షిపణులు పడినట్లు ఆనవాళ్లు లేవని ప్రభుత్వం చెప్పింది. రెండు గంటల క్రితమే దేశ రాజధానిలో సైరెన్లు మోగించామని, నెతన్యహూ ఆఫీసు ప్రస్తుతం అన్ని రకాలుగా పనిచేస్తున్నట్లు పీఎంవో పేర్కొన్నది. కువైట్‌లో మూడు అమెరికా యుద్ధ విమానాలను కూడా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే కువైట్ వైమాని దళం నిర్వహించిన ఫ్రెండ్లీ ఫైరింగ్‌లో ఆ యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు కూలినట్లు అమెరికా చెప్పింది.
ఇవాళ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడి చేసింది. ఆ క్షిపణి బీర్షెబాలో పడింది. ఆ దాడి వల్ల సుమారు 19 మంది గాయపడినట్లు తెలుస్తోంది. చాలా మంది స్వల్పంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఇరాన్ వదిలిన ఆ బాలిస్టిక్ క్షిపణి.. రెసిడెన్షియల్ ప్రాంతంలో పడడం వల్ల.. అనేక ఇండ్లు కూడా ధ్వంసం అయ్యాయి.