Lenin | అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. అఖిల్ కెరీర్లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచిన ఈ సినిమా, నటీనటుల ప్రదర్శనకు కూడా ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటనపై ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథలో కీలకమైన పాత్రలో కనిపించింది. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఆమె చూపిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అఖిల్‌తో పాటు భాగ్యశ్రీకి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే సినిమా విజయం తర్వాత మరో ఆసక్తికరమైన చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్గా శ్రీలీలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమెతో చిత్రీకరించిన గ్లింప్స్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అయితే ఆ తర్వాత అనూహ్యంగా శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారు.ఇప్పుడు ‘లెనిన్’ విజయం సాధించడంతో, ఈ నిర్ణయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ పాత్రకు భాగ్యశ్రీ చక్కగా సరిపోయిందని, ఆమె నటన కథకు మరింత బలం చేకూర్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఇదే పాత్రలో శ్రీలీల ఉంటే ఎలా ఉండేదనే అంశంపై కూడా సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు కనిపిస్తున్నాయి.
అయితే ఇవన్నీ నెటిజన్ల వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప, శ్రీలీల నటన లేదా ప్రతిభపై అధికారికంగా ఎవరు ఎలాంటి కామెంట్స్ చేయలేదు. శ్రీలీల ఇప్పటికే పలు కమర్షియల్ చిత్రాల్లో తన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటనకు ఎక్కువ అవకాశమున్న పాత్రలు భవిష్యత్తులో వస్తే ఆమె మరో కోణాన్ని చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక భాగ్యశ్రీ బోర్సే విషయానికి వస్తే, ‘లెనిన్’ విజయం ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆమె నటనకు వస్తున్న ప్రశంసలు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.