న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఒక పిటిషనర్ దూషించాడు. న్యాయమూర్తులను ‘న్యాయ సేవకులు’ అని సంబోధించాడు. కోర్టులో పేపర్లు విసిరేసి హంగామా చేశాడు. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకువెళ్లారు. (Petitioner Abuses CJI) శుక్రవారం సుప్రీంకోర్టులో ఒక నాటకీయ సంఘటన జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ ఆరాధేలతో కూడిన ధర్మాసనం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపింది.
కాగా, పిటిషనర్ ప్రబల్ ప్రతాప్, సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు హాజరయ్యాడు. తనను తాను ‘సార్వభౌముడి’గా పరిచయం చేసుకున్నాడు. న్యాయమూర్తులను ‘న్యాయ సేవకులు’ అని సంబోధించాడు. ‘మిస్టర్ న్యాయ సేవకుడా, సైబర్ క్రైమ్ సిండికేట్ నడుపుతున్నందుకు లక్నో ఏఎస్పీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశించాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నా’ అని అన్నాడు.
అయితే పిటిషనర్ వ్యాఖ్యలు విని న్యాయమూర్తి కేవీ విశ్వనాథన్ ఆశ్చర్యపోయారు. ‘నువ్వు నన్ను ఆదేశిస్తున్నావా? మమ్మల్ని ఆదేశిస్తున్నావా?’ అని అతడిని అడిగారు. ఆ తర్వాత పిటిషనర్ ప్రబల్ ప్రతాప్, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను దూషించాడు. గాలిలోకి కాగితాలు విసిరేసి విచారణకు అంతరాయం కలిగించాడు. దీంతో కోర్టు భద్రతా సిబ్బంది జోక్యం చేసుకున్నారు. అతడ్ని కోర్టు గది నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత కోర్టు రూమ్‌లోని డీఎస్పీ కార్యాలయంలో కొంతసేపు అతడ్ని నిర్బంధించారు.
మరోవైపు పిటిషనర్ ప్రబల్ ప్రతాప్‌పై చర్యలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు విచారణకు అంతరాయం కలిగించిన అతడిపై ధిక్కార చర్యలు లేదా మరే ఇతర బలవంతపు చర్యలు చేపట్టకూడదని ధర్మాసనం నిర్ణయించింది. జస్టిస్ విశ్వనాథన్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ‘మేము అతడిపై ఎలాంటి చర్య తీసుకోవాలని భావించడం లేదు. కేసు రికార్డులను పరిశీలించాం. సవాల్ చేసిన హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి మాకు సరైన కారణాలు కనిపించలేదు. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆ పిటిషనర్‌పై సానుభూతి వ్యక్తం చేశారు. ‘అతడు చాలా కలత చెందినట్లు ఉన్నాడు. ఇదంతా నిరాశే. మాకు అతని పట్ల సానుభూతి మాత్రమే ఉంది’ అని న్యాయమూర్తి విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. అయితే ఆ పిటిషనర్ సుప్రీంకోర్టులో వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“Mr Judicial servant, I order you to register FIR against ACP Vikas Nagar, Lucknow”
Man later goes on to throw papers in the court.
Dramatic scene inside India’s Supreme court. pic.twitter.com/8mPB2GPikV
— Piyush Rai (@Benarasiyaa) July 10, 2026