హైదరాబాద్ : పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య ( Six-Murder Case) చేసిన ఘటనలో నిందితుడు రాజ్‌కుమార్( Rajkumar ) ఆచూకీ తెలిపిన వారికి రూ.2లక్షల బహుమతి అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్
ప్రకటించారు. నిందితుడి ఆచూకీ తెలిపి అతని అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమా చారం అందించిన వారికి బహుమతి అందజేస్తామని వెల్లడించారు.
సమాచారం అందించిన వ్యక్తి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తామని పేర్కొన్నారు. నిందితుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 65324 నంబర్‌కు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని సూచించారు.
దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌పై మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక (17)ను వేధించాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మే 26వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే శుక్రవారం అతను జైలుపై విడుదలయ్యాడు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. షాబాద్ పీఆర్ఆర్ స్టేడియం సమీపంలోని మైనర్ బాలిక (17) ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో బాలిక తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిద్దరినీ కత్తితో పొడి చంపాడు. అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు సమీపంలోని తీసుకెళ్లి పీకకోసి హత్య చేశాడు.
శనివారం తెల్లవారుజామున తన ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్.. కట్టుకున్న భార్య సరిత (33)తో పాటు ఇద్దరు కుమారులు పరీక్షిత్(4), దైవీక్షిత్(2)లను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి అందర్నీ చంపేశానని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ్ కుమార్ చెప్పాడు. దీంతో అరుణ్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.