Medak | రామాయంపేట రూరల్ : రామాయంపేట మండల వ్యాప్తంగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు సరిగా పోయడం లేదు. మరోవైపు కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంట చేతికి వచ్చే సమయానికి ఇలా నీటి, విద్యుత్ సమస్య రావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు.
కొన్ని సంవత్సరాలుగా ఎన్నడూ బోరు బావి సమస్య రాలేదు. 586 ఫీట్లలో ఉన్న బోరు సైతం నీళ్లు పోయడం లేదు. చుట్టుపక్కల గడి చెరువు, మొగల్ కుంట, పటేల్ కుంట ఉన్నాయి. వీటిలో నీరు ఉంటే బోర్లు సక్రమంగా నీళ్లు పోసేవి. కెనాల్ వచ్చినప్పటికీ కొద్ది వ్యవసాయ భూములకు నీరు అందుతుంది. కెనాల్ ద్వారా వ్యవసాయ పొలాలకు నీరు అందించకపోయినా.. చెరువులు, కుంటలు నింపిఏత బాగుంటుంది.
యువరైతు శ్రీకాంత్ రెడ్డి, ప్రగతి ధర్మారం
కాంగ్రెస్ అంటేనే కష్టాలు అన్నట్టు తయారయింది. కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలేదు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటడం, మరోవైపు కరెంటు కోతలు ఎక్కువ కావడం పట్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం. కరెంట్ కోతల వల్ల వ్యవసాయ బోరు బావుల వద్ద ఉండాల్సిన దుస్థితి నెలకొంది. అటవీ ప్రాంతం కాబట్టి రాత్రి వేళలో అటవీ జంతువుల నుండి ప్రమాదం కలిగే అవకాశం ఉంది. రైతుల దేవుడు కేసీఆర్ ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా వ్యవసాయంతో పాటు, తాగునీటి సమస్య రాలేదు.
రైతు నరసయ్య, శివాయిపల్లి
ఒకవైపు పంటలు చేతికి వచ్చే సమయంలో బోరు బావుల్లో నీటి సరఫరా తగ్గడం చాలా బాధగా ఉంది. రైతుల గోస పట్టించుకునే నాధుడు కరువయ్యారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య రాలేదు. పొలాలకు సరిగా నీరు అందక పగలు రాత్రి అనే తేడా లేకుండా బోరు మోటర్లను నడిపిస్తుండటంతో అవి కాలిపోతున్నాయి. వీటిని మరమ్మతు చేయించి తెచ్చేసరికి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది.
రైతులు ఎరుకల రాములు, టంకరి బాలయ్య, సుతారిపల్లి