చేర్యాల, జనవరి 18: సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో హైడ్రామా చోటుచేసుకుంది. కందుల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాకముందే డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, కొందరు డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కేంద్రం వద్ద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి వెళ్లిపోయాడు. అధికారుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి పల్లా చేర్యాల మార్కెట్‌యార్డుకు వస్తున్నారని తెలుసుకున్న సంబంధిత అధికారులు హుటాహుటిన తిరిగి రిబ్బన్ ఏర్పాటు చేసి కొబ్బరికాయలు తీసుకువచ్చి కేంద్రం ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే వచ్చి కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు మద్దతు ధర వచ్చేలా, ఎలాంటి అవినీతికి తావులేకుండా కేంద్రం నిర్వహించాలని సూచించారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వారిపై ఆగ్రహ వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ పాటించక పోవడం సిగ్గుచేటని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వారి చేతిలో కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు.