విద్యను సేవగా భావించేవారు ఒకప్పుడు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో విద్య లాభదాయక వ్యాపారంగా మారింది. అడ్మిషన్ నుంచి డెవలప్మెంట్ ఫీజు, యాక్టివిటీ ఫీజు, ట్రాన్స్పోర్ట్, పుస్తకాలు, యూనిఫామ్ వరకు ప్రతి అంశంలో తల్లిదండ్రులపై భారీగా ఆర్థిక భారం మోపుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల ఫీజు పెంపుపై తల్లిదండ్రుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా 20 నుంచి 30 శాతం ఫీజులు పెంచుతున్నారు. యూనిఫామ్, పుస్తకాలు తప్పనిసరిగా తమ సూల్లోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫీజుల వివరాల్లో పారదర్శకత ఉండడం లేదు.
ఫీజు ఆలస్యమైతే విద్యార్థులను అవమానపరిచే ఘటనలు కోకొల్లలు. పిల్లల చదువుకు అప్పు చేయాల్సి వస్తోంది. నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేటు పాఠశాలలు చేస్తున్న దోపిడీతో తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఎదురొంటున్నామని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు.
సిద్దిపేట, జూన్ 24( నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచి విద్యను అందించాలని కోరుకునే తల్లిదండ్రుల బలహీనతను ప్రైవేట్ విద్యాసంస్థలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు కనీస వసతులు కల్పించడంలేదు. ఫ్యాన్లు, లైట్లు కూడా ఉండడంలేదు. ఇరుకు గదుల్లో చీకటిగా ఉండడతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస వసతులు కల్పించడంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విఫలమవుతున్నాయి.
అధిక ఫీజలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు ఉపాధ్యాయుల నిమామకంలో నిబంధనలను తిలోదకాలిస్తున్నారు. బీఈడీ, డీఈడీ, పీజీ చదిన వారికి బదులుగా ఇంటర్, డిగ్రీ చదివిన వారిని పెట్టుకుని, రికార్డులో అర్హత ఉన్న వారి పేర్లు రాస్తున్నారు. నోటీస్ బోర్డులో ఉపాధ్యాయులు వేరు. విద్యార్థులకు చదివు చెప్పే వారు వేరు. విస్త్రత ప్రచారం చేస్తూ భారీగా ఫీజులు పెట్టి తల్లిదండ్రుల నుంచి డబ్బులు గుంజేస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో 214, మెదక్ 120, సంగారెడ్డిలో 1700 పైచిలుకు ప్రైవేట్ పాఠశాలలున్నాయి. దాదాపు 90 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, చేర్యాల ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రైవేట్ పాఠశాలలున్నాయి. నర్సరీకి అన్ని ఫీజులు కలిపి రూ.40 వేలపైనే. ఇక 1 నుంచి 5వ తరగతి వరకు రూ.50 వేలు, 6 నుంచి 9వ తరగతి వరకు రూ. 65వేలు, పదో తరగతి విద్యార్థులకు రూ.70 వేలు. యూనిఫామ్, టై బెల్ట్, ఐడీ కార్దులతో పాటు నోట్ పుస్తకాలు, టెక్ట్స్ బుక్కుల పేరిట వేలాది రూపాయలు గుంజుతున్నారు. గతంలో ఉన్న యూనిఫాం కాకుండా మళ్లీ కొత్తగా యూనిఫామ్లు మార్చడంతో విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారం భారీగానే పడుతున్నది. 10వ తరగతి పూర్తయితే ఆ యూనిఫామ్లు ఎందుకూ పనికిరావు. నర్సరీ విద్యార్థికి రూ.50వేలు, పదో తరగతి విద్యార్థికి సుమారు రూ.లక్ష ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు.