సిద్దిపేట, మే 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాల మధ్యలో కొను గోలు కేంద్రాల్లో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రైతుల కష్టాల్లో తోడుగా నిలవాల్సిన మంత్రులు ఎకడా కనిపించడం లేదు.కొనుగోలు కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా ధాన్యం తూకం వేయకపోవడం, తరుగు పేరుతో భారీ కోతలు విధించడం, గోనె సంచుల కొరత, హమాలీల సమస్యలు, ట్రాన్స్‌పోర్టు ఆలస్యం వంటి ఇబ్బందులతో రైతులు నలిగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అండగా నిలవాల్సిన మంత్రులు పత్తాలేరు. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ కనీసం రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లా స్థాయిలో ఒక్క రివ్యూ నిర్వహించడం లేదు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలపై కన్నె త్తి చూడలేదు. రోహిణి కార్తె రావడంతో ఎండలు తీవ్రమయ్యాయి. అకాల వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం జిల్లాలో అకాల వర్షాలు కురవడంతో రైతులు బెంబేలెత్తి పోయారు. ఇంత జరుగుతున్నా మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రెస్మీట్లు, ప్రకటనలకే మంత్రులు పరిమితమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ తీరు చూస్తుంటే మే 31కి ధాన్యం కొనుగోళ్లు బంద్ జేసేలా కనిపిస్తున్నది. ఇప్పటికే కలెక్టర్లకు అంతర్గత ఆదేశాలు ప్రభుత్వం నుంచి చేరినట్లు సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సరాసరిగా 61 శాతం వడ్లు మాత్రమే కొన్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 9,70,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 5,89,000 టన్నుల ధాన్యం మాత్రమే సేకరించారు. సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు 2,54,000 మెట్రిక్ టన్నులు సేకరించారు.కేవలం 63 శాతం మేర పూర్తి అయ్యి ంది.మెదక్ జిల్లాలో 3.50 లక్షల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 2,40,000 మెట్రిక్ టన్ను లు కొన్నారు. ఈ జిల్లాలో 68 శాతం పూర్తి అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 95,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించారు. ఈ జిల్లాలో 43 శాతం కొనుగోళ్లు పూర్తి చేశారు. పొద్దు తిరుగుడు, మక్కల కొనుగోళ్లను ప్రభుత్వం మధ్యలోనే చేతులెత్తేసింది. 50 రోజులకు పైగా కేంద్రాల్లోనే ధాన్యం ఉంటే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మళ్లీ ఒకటి రెండు రోజుల నుంచి ఈ పంటలు కొనేలా చేశారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన 40 రోజులకు పైగానే రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాత్రింబవళ్లు ధాన్యం కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. వర్షం పడితే ధాన్యం తడిసి రంగు మారుతున్నది. తడిసిందనే పేరుతో అధికారులు ధర కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.ఇంత జరుగుతున్నా మం త్రులు కనీసం కేంద్రాలను సందర్శించడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు అందడం లేదు. కేంద్రాల్లో తరుగు, తేమ పేర్లతో క్వింటాల్‌కు కిలోల కొద్దీ కోత విధిస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో దళారుల హవా నడుస్తున్నది. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులపై పర్యవేక్షణ పెంచితేనే పరిస్థితి మారుతుంది.
కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయి. కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు అందిన కాడికి రైతులను దోచుకుంటున్నారు. బస్తాకు 43 కిలోలు కాంటా పెడితేనే మిల్లర్లు దించుకుంటున్నారు. క్వింటాల్‌కు సరాసరిగా 6 నుంచి 8 కిలోల తరుగు తీస్తున్నారు. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకు ధాన్యం పండుతుంది. ఈ లెక్కన ఎకరాకు రెండు క్వింటాళ్ల చొప్పున తరుగు పేరి ట రైతులు నష్టపోతున్నారు. తరుగు రూపంలో దోచుకున్న ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులె మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,నేతలు వాటాలు పంచుకుంటున్నారు. ఎంత లేదన్న ఒక్కో సెంటర్ నుంచి కొనుగోళ్లు పూర్తయ్యే సరికి రైతుల మీద రూ.10నుండి 15 లక్షల వరకు దోచుకుంటున్నారు.
రైతులు వడ్ల కుప్పల మీదనే పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటీవల వడ్ల కుప్పల మీదనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతు చనిపోయాడు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి పడరాని పాట్లు పడుతున్నా…పిట్టల్లా రైతు లు చనిపోతున్నా ప్రభుత్వానికి కనికరం రావడం లేదు. యాసంగి వడ్లు ఇంత వరకు అమ్ముడు పోలేదు. కాలం నెత్తి మీదికి వచ్చింది..రోహిణి కార్తె ప్రారంభమైంది. మళ్లీ వానకాలం సాగుకు తుకాలు పోయాలి. చేతిలో రూపాయి లేదు. రైతులు ఇబ్బంది పడుతున్నా రు. 40 రోజులుగా కల్లాలోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు.ఆకాల వర్షాలకు వడ్లు తడిసి, కింద సీసీ లేక మట్టిలో కలిసిపోయి చెదలు పడుతున్నాయి. లారీలు, బస్తాలు పంపాలని రైతులు మొ త్తుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మిల్లుల వద్ద ధాన్యం లారీలు,ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఏసీ రూముల నుంచి మంత్రులు కదిలి రావడం లేదు.
మర్కూక్,మే 26 : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు నమ్మకం పోయింది. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు రోడ్డు మీద ఒక్క వడ్లిత్తు లేకుండా కేసీఆర్ సార్ అధికారులను పరుగెత్తించి వడ్లు కొనిపిచ్చాడు. ఈ ప్రభుత్వంలో మా రైతులకు అన్నీ కష్టాలే.సమయానికి యూరియా దొరుకుత లేదు.పండించిన పంట అమ్ముకోవడానికి కష్టపడాల్సి వస్తున్నది. ఎర్రవల్లి ఐకేపీ సెంటరుకు వడ్లు తెచ్చి 20 రోజులైతుంది. మాయిశ్చర్ కూడా ఇచ్చాను. వడ్లన్నీ ఎండలో ఎండిపోతున్నాయి.మా బాధలు పగోనికి కూడా రావద్దు.
– కుంట నర్సమ్మ, మహిళా రైతు, ఎర్రవల్లి,మర్కూక్ (సిద్దిపేట జిల్లా)
జగదేవపూర్, మే 26: కాంగ్రెస్ సర్కారు వడ్లు కొంటదనే నమ్మకం పోయింది. కొనుగోలు కేంద్రాల్లో గుట్టలు గుట్టలుగా ఉన్న వడ్ల రాశులను చూ స్తే భయమేస్తుంది. నెల రోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్న వడ్లు పోతలేవు. వడ్ల కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం చేస్తుండటంతో చేసేదేమి లేక బయట మార్కెట్ల క్వింటాల్ రూ.1850 అమ్ముకున్న, క్వింటాల్‌కు రూ.500 నష్టమని తెలిసినా ఏమి చేయలేక 80 క్వింటాళ్ల వడ్లు అమ్ముకున్న.నాతో పాటు చాలా మ ంది చేసేదేమి లేక బయట మార్కెట్ల అమ్ముకున్నం.
– కరుణాకర్‌రెడ్డి, రైతు, జగదేవపూర్ (సిద్దిపేట జిల్లా)
వర్గల్, మే 26 : చివరి గింజ వరకూ కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మాటతప్పిం ది. నెలరోజులు అవుతున్నా ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. ఈనెల చివరి వరకు వడ్ల కొనుగోళ్లు ముగిస్తామని స్వయంగా వ్యవసాయ మంత్రే అంటుండు. ధాన్యమేమో ఇంకా కొనుగోల్లు కేంద్రా లు, రోడ్ల మీద ఉండిపోయింది. అధికారులు లారీల సమస్య ఉంది మేమేమి చేయలేము అంటున్నరు. దీంతో చేన్ల నుంచి తెచ్చి న ధాన్యం సెంటర్లతో పాటు రోడ్డు మీద కుప్పలు ,తెప్పలుగా ఉండిపోయింది. అకాల వర్షంతో వడ్లు తడుస్తున్నాయి. ప్రభుత్వం ఇట్ల చేయడం న్యాయం కాదు.
-చిన్నమొల్ల స్వామి, రైతు, మైలారం, వర్గల్ మండలం(సిద్దిపేట జిల్లా)
జగదేవపూర్ మే 26 : వడ్లు కేంద్రానికి తెచ్చి 20 రోజులు అయితుంది. ఇప్పటికి నా వడ్లు పోలే. అధికారులను అడిగితే లారీలు వస్తలేవు, మిల్లులల్ల దించుకుంటలేరు అని చెబుతుర్రు. నెత్తిమీదికి కాలం అస్తున్నది. మొగులు అయితుంది. కేంద్రంలో వడు ్లతడుస్తయని భయమయితుంది. గతంలో ఎప్పుడు ఇట్ల కాలే. వడ్లు కొనడంల సర్కారు పూర్తిగా విఫలమైంది. అధికారులు పట్టించుకుంటలేరు. మిల్లుక పోయిన వడ్ల నుంచి కిలో రెండు కిలోలు కట్ చేస్తున్నారు. రైతుకు ఎంత కష్టం చేసినా నష్టమే మిగులుతుంది.
-సైదుగారి యాదయ్య,రైతు, చాట్లపల్లి(సిద్దిపేట జిల్లా)