ఆరుగాలం కష్టపడి నలుగురికి అన్నంపెట్టే అన్నదాత తనువు చాలిస్తున్నాడు. ప్రకృతితో పాటు ప్రభుత్వం నుంచి చేయూత, సహకారం కరువై, ఎవుసం భారంగా మారి కాడివదిలేస్తున్నాడు. పంటలు ఎండిపోవడం, నీళ్లకోసం బోర్లు తవ్వించడం, సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయడం, రుణమాఫీ వర్తించక పోవడం, రైతుభరోసా రాక ధైర్యం కోల్పోతున్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో తను నమ్ముకున్న పొలంలోనే బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి అనేక రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
సిద్దిపేట, మార్చి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. నిత్యం ఏదో ఒక ఊరిలో రైతు ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంటున్నది. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో రైతులకు చేయూత కరువై మెదక్ జిల్లాలో 75 మందికి పైగా సిద్దిపేట జిల్లాల్లో 35, సంగారెడ్డి జిల్లాలో 25, మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 135 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది రైతులకు పంట రుణమాఫీ వర్తించలేదు. రెండు లక్షల పైన ఉన్న పంటరుణం ఉన్న రైతులు బ్యాంకులో డబ్బులు కట్టాలని ప్రభుత్వం సూచించగా, చాలామంది రైతులు రుణమాఫీ అవుతదని అప్పులుతెచ్చి కట్టారు.
కానీ, కాంగ్రెస్ సర్కార్ వారి రుణమాఫీని మరిచి పోయింది. దీంతో బ్యాంకులో ఉన్న అప్పుకు తోడు..బ్యాంకు వడ్డీ కట్టడానికి తెచ్చిన డబ్బులు తడిసి మోపెడు అయ్యాయి. ఇప్పుడు రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. పంట పెట్టుబడి సాయం రాక అప్పులు తెచ్చి పంటలు సాగుచేస్తున్నారు. ఈసారి సాగునీటి సమస్య ఎదురుకావడంతో పంటలు ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకోవడానికి రైతులు అప్పులు చేసి మరీ బోర్లు వేయిస్తున్నారు. నీళ్లు పడక, పంటలు ఎండిపోతుండడంతో మనస్తాపం చెంది చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
పొలాల్లోనే రైతులు ఆత్మహత్యకు ఒడిగడుతూ కుటుంబాల్లో పుట్టెడు దు:ఖాన్ని మిగిలిస్తున్నారు. ఎకరాకు రూ. 15 వేల రైతుభరోసా ఇస్తానని చెప్పిన కాంగ్రెస్, తీరా రెండు పంటలకు ఎగ్గ్గొట్టింది. కేసీఆర్ హయాంలో ఠంఛన్‌గా పంటల సాగుకు ముందే రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో రైతుబంధు ఎకరానికి రూ. 10 వేలు పడేది. దీంతో రైతులకు పెట్టుబడి రంది లేకుండా పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంట రుణమాఫీ విషయంలో రైతులను ప్రభుత్వం ధోకా చేసింది. పంటలకు బోనస్ అని చెప్పి అది మోసం చేసింది. దీంతో రైతు ఎవుసం చేయలేక తనువు చాలిస్తున్నాడు.
పంట రుణం మాఫీ కాలే…
సిద్దిపేట, మార్చి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయకపాయే.. రైతు భరోసా రాకపాయే.. అప్పులు తెచ్చి బోర్లు వేయిస్తే చుక్క నీరు రాకపాయే.. పంటలేమో పండకపాయే.. తెచ్చినకాడ అప్పులవాళ్లు పైసలు అడగవట్టిరి.. బిడ్డపెండ్ల్లికి ఎదిగే.. అప్పులు ఎలా తీర్చాలే… బిడ్డ పెండ్లి ఎట్లా చేయాలే… అని తనలో తాను కుమిలిపోయి.. ఏం చేయాలో పాలుపోక తనకు చావే మార్గం అనుకున్నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మల్చెరుతండా మదిర గ్రామం దుబ్బతండాకు చెందిన రైతు బానోతు బాలు (45). నవంబర్ 29న రాత్రి భార్యతో కలిసి రొట్టె తిన్న అతడు ఇంటి బయటకు వచ్చి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి బిడ్డ పెండ్లి ఆగిపోయింది. పుట్టెడు దుఃఖంతో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతోంది.
అప్పులు పెరిగి…
రైతు బానోతు బాలుకు భార్య సుకిణి, కుమారుడు వినోద్, కూతురు వసంత ఉన్నారు. వీరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వరి, మొక్కజొన్న పంటలను సాగుచేస్తూ కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. వ్యవసాయ బావిలో నీళ్లు అంతంతమాత్రంగానే ఉండేవి. ఈ క్రమంలో తన పొలంలో ఆరు బోర్లు తవ్వించాడు. ఒక్కో బోరు 500 ఫీట్ల వరకు వేయించాడు. చుక్క నీరు రాలేదు. బోరు తవ్వించడానికి, భూమిని చదును చేయించడానికి సుమారు రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు. పంటలు సరిగ్గా పండలేదు. అప్పు లు తెచ్చిన కాడ మిత్తిలు పెరిగి పోయాయి. పంట పెట్టుబడికి సైతం అప్పులు తెచ్చాడు.
కేసీఆర్ ప్రభుత్వంలో పంట పెట్టుబడి రైతుబంధు సమయానికి వచ్చి పెట్టుబడికి ఇబ్బంది లేకుండే. ఇవ్వాల ఆ పరిస్థితి రైతుకు లేకుండా పోయింది. బ్యాంకులో తీసుకున్న పంట రుణం అట్లే ఉండిపోయింది. హుస్నాబాద్ గ్రామీణ బ్యాంకులో తీసుకున్న రుణం అసలు మిత్తి అన్నీ కలిపి సుమారుగా రెండు లక్షల వరకు ఉంది. కాంగ్రెస్ చేసిన రుణమాఫీలో ఈ రైతుకు ఒక్క రూపాయి మాఫీ కాలేదు. చేసిన అప్పులు తీర్చడం కోసం నెదర్లాండ్ దేశం బతక పోతానని ఓ బ్రోకర్‌ను కలిశాడు. వీసా ఇప్పిస్తానని బ్రోకర్ రూ. 50 వేలు తీసుకున్నాడు. ఆ బ్రోకర్ వీసా ఇప్పించలేదు. దీంతో అప్పులు రోజు రోజుకు పెరిగి పోయాయి. ప్రభుత్వం తనకు రుణమాఫీ చేయలేదని కుటుంబ సభ్యులు, ఇతర పెద్ద మనుషులతో చెప్పుకుంటూ రైతు బాలు బాధపడేవాడని గ్రామస్తులు గుర్తుచేశారు. దీంతో కుమిలిపోయి నవంబర్ 29 రాత్రి రైతు బానోతు బాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.