గజ్వేల్, ఆగస్టు 13: పింఛన్ వస్తలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవ రూ పట్టించుకోవడం లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగాధరి పోచవ్వ బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డితో ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పింఛన్ డబ్బులు ఇచ్చేలా తమవంతు ప్రయత్నం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గతంలో కేసీఆర్ ఇచ్చే పింఛన్ డబ్బులు కూడా సరైన సమయంలో ఇస్తలేరని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈసందర్భంగా మంగళవారం వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం సరైన సమయానికి పింఛన్ డబ్బులు ఇచ్చి వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలను ఆదుకున్నదన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే రూ.4వేలకు పింఛన్ పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని మాట తప్పిందన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతిని విస్మరించిందన్నారు. యువ వికాసం ద్వారా విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా అమలు చేయలేదన్నారు. గురుకుల పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారని ఆరోపించారు.